
న్యూఢిల్లీ: ఇండియా జీడీపీ కిందటేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో 6.2 శాతం వృద్ధి చెందింది. గ్రోత్ రేటు 6.3 శాతంగా నమోదవుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ సెక్టార్లలో ఉత్పాదకత తగ్గడంతో జీడీపీ గ్రోత్ నెమ్మదించింది. కిందటేడాది జులై– సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీ 5.6 శాతం పెరగగా, 2023 డిసెంబర్ క్వార్టర్‌లో 9.5 శాతం వృద్ధి చెందింది. 2024–25 మొత్తం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా నమోదవుతుందని ఎన్‌ఎస్‌ఓఅంచనా వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో వేసిన 6.4 శాతం అంచనా నుంచి పెంచింది.
ద్రవ్యలోటు రూ.11.69 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కిందటేడాది బడ్జెట్‌లో వేసుకున్న ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్– ఖర్చులు, ఆదాయం మధ్య తేడా) అంచనాల్లో 74.5 శాతాన్ని జనవరి 31 నాటికే చేరుకున్నామని కేంద్రం ప్రకటించింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) లెక్కల ప్రకారం, కిందటేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ఇండియా ద్రవ్యలోటు రూ.11,69,542 కోట్లుగా రికార్డయ్యింది.
ఈ టైమ్ పీరియడ్‌లో ప్రభుత్వానికి నికరంగా రూ.19.03 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ రాగా, రూ.35.7 లక్షల కోట్ల ఖర్చులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. అంటే రూ.15.69 లక్షల కోట్ల లోపు ఉంచాలని చూస్తోంది.