
న్యూఢిల్లీ: మనదేశ జీడీపీ గ్రోత్ రేట్ ఈ ఏడాది ఏప్రిల్– జూన్ క్వార్టర్ (క్యూ1) లో 15 నెలల కనిష్టానికి తగ్గింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో 8.2 శాతం, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, క్యూ1 లో 6.7 శాతంగా రికార్డయ్యింది. ‘కిందటి ఆర్థిక సంవత్సరంలోని జూన్ క్వార్టర్‌లో నమోదైన 8.2 శాతం గ్రోత్ రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌లో రియల్ జీడీపీ 6.7 శాతం వృద్ధి చెందింది’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) (జీడీపీ నుంచి నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్‌లను తీసేయగా మిగిలింది) క్యూ1 లో 6.8 శాతం పెరిగిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. క్యూ1 లో జీడీపీ 7.1 శాతం వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిన విషయం తెలిసిందే. జీడీపీ గ్రోత్ రేట్ 6 శాతం నుంచి 7.1 శాతం మధ్య ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. మరోవైపు నామినల్ (ప్రస్తుత ధరల దగ్గర) జీడీపీ గ్రోత్ రేట్ జూన్ క్వార్టర్‌లో 9.7 శాతంగా రికార్డయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌లో 8.5 శాతంగా ఇది నమోదయ్యింది.
ద్రవ్యలోటు..
కేంద్ర దవ్యలోటు (ఖర్చులు, ఆదాయం మధ్య తేడా) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలలు ముగిసే నాటికి పూర్తి ఏడాది టార్గెట్‌లో 17.2 శాతానికి చేరుకుంది. రూ.2,76,945 కోట్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.16,13,312 కోట్లకు కుదించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) లెక్కల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి రూ.7.15 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది. మొత్తం ఖర్చులు రూ.13 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి.