
న్యూఢిల్లీ: ఇండియా జీడీపీ 2030–31 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2024 నాటికి జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) పరంగా ధనిక రాష్ట్రాల వివరాలను బయటపెట్టింది. ఈ లిస్టులో రూ.42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర టాప్‌లో ఉంది.
దేశ జీడీపీలో ఈ రాష్ట్ర వాటా 13.30 శాతంగా ఉంది. రూ.31.55 లక్షల కోట్లతో ఆ తర్వాత ప్లేస్‌లో తమిళనాడు నిలిచింది. ఇండియా జీడీపీలో ఈ రాష్ట్ర వాటా 8.90 శాతం. కర్నాటక (రూ.28.09 లక్షల కోట్లు), గుజరాత్ (రూ.27.9 లక్షల కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ.24.99 లక్షల కోట్లు), వెస్ట్ బెంగాల్ (రూ.18.8 లక్షల కోట్లతో), రాజస్థాన్ (రూ.17.8 లక్షల కోట్లు) ఈ లిస్టులో టాప్‌లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా ఎనిమిది, తొమ్మిది ప్లేస్‌లలో నిలిచాయి. తెలంగాణ జీఎస్‌డీపీ రూ.16.5 లక్షల కోట్లు కాగా, దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.90 శాతంగా ఉంది. 2023–24 నాటికి జీఎస్‌డీపీ పర్ క్యాపిటా ఇన్‌కమ్ రూ.3.83 లక్షలుగా నమోదైంది. ఆంధ్ర ప్రదేశ్ జీఎస్‌డీపీ రూ.15.89 లక్షల కోట్లుగా ఉంది. మధ్యప్రదేశ్ రూ.15.22 లక్షల కోట్లతో పదో ప్లేస్‌లో నిలిచింది.