
- వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పవు
- నీతి, నియమాలు తప్పకుండా పాటించాల్సిందే
- ‘ఏ’ రేటింగ్ కంటెంట్‌ను పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు..
- సెక్సువల్, చట్టం నిషేధించిన కంటెంట్ టెలికాస్ట్ చేయొద్దని వార్నింగ్
న్యూఢిల్లీ: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, యూ ట్యూబ్ చానళ్లలో హద్దులు మీరుతున్న కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. నీతి, నియమాలు తప్పకుండా పాటించాల్సిందేనని ఆదేశించింది. 2021లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్దేశించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్లను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా చానళ్లకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం నోటీసులు జారీ చేసింది.
కంటెంట్‌ను వయసు ఆధారంగా నిర్ధారించాలని, ‘ఏ’ రేటింగ్ కంటెంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలని సూచించింది. ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లు, పబ్లిషర్లు, ఓటీటీ చానళ్లు, యూట్యూబర్లు నియంత్రణ పాటించాలని పేర్కొంది. చట్టాలు, నైతిక విలువలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సెక్సువల్ కంటెంట్, చట్టం నిషేధించిన కంటెంట్ ఏ రూపంలోనూ టెలికాస్ట్ చేయొద్దంది.
రూల్స్ అతిక్రమించి ప్రసారం చేసినోళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కమెడియన్ సమయ్ రైనా ఆధ్వర్యంలోని ఇండియాస్ గాట్ టాలెంట్(ఐజీటీ) షో సందర్భంగా తల్లిదండ్రులనుద్దేశించి యూట్యూబర్ అల్హబాదియా చేసిన వల్గర్ కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు హెచ్చరికలు జారీ చేసింది.