- భక్తజనసంద్రంగా త్రివేణి సంగమం
- పుష్య పౌర్ణమి కావడంతో కోటిన్నర మంది పుణ్య స్నానాలు
- యూపీ సర్కార్‌కు రూ.2 లక్షల కోట్ల ఆదాయం
మహాకుంభనగర్ (యూపీ): వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య త్రివేణి సంగమంలో సోమవారం తెల్లవారుజామున మహాకుంభ మేళా ప్రారంభమైంది. హర హర మహాదే వ.. జైశ్రీరాం.. జై గంగామయ్య.. నినాదాలతో ప్రయాగ్‌రాజ్ మారుమోగుతున్నది. సోమవారం పుష్య పౌర్ణమి కావడంతో కోటిన్నరకు పైగా భక్తులు రాజ స్నానాలు ఆచరించారు. ఉదయం 9 గంటల వరకు సుమారు 60 లక్షల మంది స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా తొలి రోజే త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని ప్రధాని మోదీ తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైందని.. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చిందని తెలిపారు. దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా, 45 రోజుల ఈ ఆధ్యాత్మిక పండుగ సందర్భంగా యూపీ ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం జనరేట్ అవుతుందని అంచనా.
తొలిరోజే ఫారినర్ల పుణ్య స్నానాలు
మహాకుంభ మేళా ప్రారంభమైన తొలిరోజే పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు రాజస్నానాలు ఆచరించారు. యూఎస్ ఆర్మీ మాజీ సోల్జర్ సన్యాసిగా మారిపోయాడు. ‘బాబా మోక్షపురి’ అని పేరు పెట్టుకున్నాడు. తొలిసారి కుంభమేళాలో స్నానంచేసి మోక్షం పొందినట్లు వివరించాడు. సౌత్ కొరియా, జపాన్, యూరోపియన్ భక్తులు కూడా వచ్చారు. ఇప్పటివరకు ఇలాంటి ఆధ్యాత్మిక వేడుక తమ జీవితంలో చూడలేదని తెలిపారు. త్రివేణి సంగమంతో తనకు విడదీయలేని బంధం ఏర్పడిందని స్పెయిన్‌కు చెందిన క్రిస్టియానా చెప్పింది. స్పెయిన్‌కు చెందిన దంపతులు, బ్రెజిల్ లో యోగా నేర్పించే షిఖు ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ రాజస్నానం చేశారు. సుమారు 60 దేశాల నుంచి భక్తులు మహాకుంభ మేళాకు వస్తారని అంచనా.
సర్కార్‌కు భారీ ఆదాయం
45 రోజుల్లో సుమారు 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వస్తారని ప్రభుత్వ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చుపెడుతున్నది. ఒక్కో భక్తుడు యావరేజ్‌గా రూ.5 వేలు ఖర్చు చేసినా.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఫుడ్, బేవరేజెస్ సెక్టార్లో రూ.20 వేల కోట్ల వ్యాపారం జరగొచ్చని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఆయిల్, దీపాలు, గంగా వాటర్, ప్రతిమలు, అగరబత్తులు, ఆధ్యాత్మిక పుస్తకాలు బిజినెస్‌లో మరో రూ.20 వేల కోట్లు, ట్రాన్స్పోర్ట్, టూరిజం సెక్టార్లో రూ.20వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. ఇదే జరిగితే యూపీ ఆర్థికంగా పటిష్టం అవుతుంది. స్టేట్ జీడీపీ 1% పెరుగుతుంది.
భారీగా తప్పిపోతున్న భక్తులు
సోమవారం సుమారు 500 మంది వరకు కుంభమేళాలో తప్పిపోయారు. ఇలాంటి వారి కోసం ‘భులా-భట్కా’ క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరు తప్పిపోయినా ఈ క్యాంప్‌కు వెళ్తే.. మైక్ ద్వారా పేరు, ఊరు, ఫ్యామిలీ మెంబర్ల గురించి అనౌన్స్ చేస్తున్నా రు. తప్పిపోయిన వాళ్లను తమ ఫ్యామిలీలతో కలుపుతున్నారు. ఒకవేళ ఎవరూ రాకపోతే.. అలాంటి వారికి షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడే ఉంచుతున్నారు. ఇలాంటి వారి కోసం ఎత్తైన వాచ్టవర్లను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల కోసం ‘ఖోయా.. పాయా’ వేర్వేరు విభాగాలు ఉన్నాయి. తప్పిపోయిన వాళ్ల ఫొటోలను సోషల్ మీడియాలో వెంటవెంటనే అప్లోడ్ చేస్తూ బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ కు తెలియజేసేందుకు స్పెషల్ సెటప్‌ను ఏర్పాటు చేశారు.
4 గంటల్లో 60 లక్షల మంది..
సూర్యోదయం తర్వాత 7.30 గంటల దాకా దాదాపు 35 లక్షల మంది భక్తులు రాజ స్నానాలు ఆచరించారు. 9.30 గంటల వరకు ఈ సంఖ్య 60 లక్షలకు పెరిగింది. ఆదివారం రాత్రే ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్న లక్షలాది మంది భక్తులు.. పాటలు.. భజనలు చేస్తూ.. సోమవారం తెల్లవారుజామున త్రివేణి సంగమం వైపు కదిలారు. గడ్డ కట్టించే చలిలోనే భక్తులు రాజస్నానాలు చేసి.. గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమంలో ఐదు మునకలు వేస్తే.. మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నాగ సాధువులు, మహంత్‌లు, బాబాలు పెద్ద సంఖ్యలో రాజ స్నానాలు ఆచరించా రు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేసినట్లు వివరించారు.
ఇంటికే కుంభమేళా జలాలు
మహా కుంభమేళాకు వెళ్లలేనివారు ఇంట్లో నే త్రివేణి సంగమ జలాలతో పుణ్యస్నానాలు చేసి ఆ ఫలాన్ని పొందొచ్చని శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని తెప్పించుకునే వీలుందని, పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా పంపిస్తాయని చెప్పారు. ‘త్రివేణి సంగమ్ వాటర్ డెలివరీ సర్వీస్’ కుంభమేళా నుంచి నీటిని ఇంటికే నేరుగా డెలివరీ చేస్తోందని పేర్కొన్నారు. ఆన్లైన్ పోర్టల్లలోనూ కుంభ్ నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, డెలివరీ చార్జీలు చెల్లించాలి.