సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌పై తిరుగులేని ఆటతో.. అద్భుత విజయాలు సాధించిన టీమిండియాకు అఫ్గానిస్థాన్ వంటి చిన్న ప్రత్యర్థి ఎదురైతే వార్ వన్‌సైడ్ అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగానే.. ఇండియా కనీసం 400 రన్స్ చేస్తుందని, మరెన్నో రికార్డులు బద్దలు కొడుతుందని ఆశించారు. తీరా ఎంతో ఆశతో.. ఆసక్తితో టీవీల ముందు కూర్చుంటే చచ్చీచెడి 200 రన్స్ చేసింది మన జట్టు. బుమ్రా, షమీ పవర్‌ఫుల్ బౌలింగ్‌తో బతికిపోయింది గానీ లేదంటే కోహ్లీసేనకు ఘోర అవమానమే మిగిలేది. దీనికి ప్రధాన కారణం మిడిలార్డర్ వైఫల్యం. వరల్డ్‌కప్ ముందు సవాల్‌గా మారిన ఈ సమస్య మళ్లీ తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
అసలు టోర్నీలో ఒక్క విజయం కూడా సాధించని అఫ్గాన్‌పై ఇండియా 224/8 స్కోరు చేయడమే అనూహ్యం. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేయగలిగాడు. పిచ్ కాస్త టఫ్‌గా ఉన్నా ప్రమాదకరంగా ఏమీ లేదు. కానీ, కోహ్లీ మినహా మిగతా వాళ్లంతా అఫ్గాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడడం శోచనీయం. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం మరోసారి బయటపడింది. జోరుమీదున్న శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా అద్భుతంగా ఆడడంతో మన మిడిలార్డర్‌కు పెద్దగా పని తగల్లేదు. ఇప్పుడు అతి చిన్న జట్టు విసిరిన సవాల్ ముందు చేష్టలుడిగిపోయింది. ఇప్పటికే గాయం కారణంగా ధవన్ టోర్నీకి దూరమయ్యాడు. ఒకవేళ రోహిత్, కోహ్లీ ఒకేరోజు ఫెయిలైతే.. జట్టు పరిస్థితి ఏమిటన్నది సమాధానం లేని ప్రశ్న. టాపార్డర్ ఫెయిలైన సందర్భాల్లో బాధ్యత తీసుకోవడానికి మిడిలార్డర్ రెడీగా ఉండాలి. కానీ, అఫ్గాన్‌పై ఆడిన తీరు చూశాక మిడిల్‌పై నమ్మకం ఉంచడం కష్టమే అనిపిస్తోంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నాలుగో నంబర్‌కు సరైనా బ్యాట్స్‌మనేనా? అనిపిస్తోంది. అతని బ్యాటింగ్‌లో ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేదు. ఈ మ్యాచ్‌లో శంకర్ బౌలింగ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు టీమ్‌లో అతను ఉన్నా కూడా లేనట్టే అనిపిస్తుంది. 52 బంతులాడి 28 పరుగులే చేసిన ధోనీ స్ట్రయిక్ రొటేట్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. కేదార్ జాదవ్ హాఫ్ సెంచరీ చేసినా… అతను కూడా నింపాదిగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరి ఆట విసుగుతెప్పించిందని సచిన్ టెండూల్కర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.
మొత్తంగా లోయర్ ఆర్డర్ సరిగ్గా ఆడకపోవడంతో ఇండియా కనీసం 20 నుంచి 30 రన్స్ తక్కువగా చేసింది. ఎలాగోలా మ్యాచ్ గెలిచినా.. బ్యాటింగ్ లైనప్ గురించి కెప్టెన్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధవన్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది. ఒకరకంగా, అఫ్గాన్‌పైనే పంత్‌ను ఆడించాల్సింది. అంత చిన్న జట్టుపై ఆరో బౌలర్ అనవసరం. ఒకవేళ రిషబ్‌కు చాన్స్ ఇస్తే మిడిల్, చివరి ఓవర్లలో కాస్త జోరు పెంచే అవకాశం జట్టుకు ఉంటుంది. పైగా, ధవన్ దూరమైన తర్వాత జట్టులో ఒక్క లెఫ్టాండర్ కూడా లేడు. ఇండియా తన తర్వాతి మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో పోటీ పడనుంది. బంగ్లాదేశ్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. అఫ్గాన్‌పై ఆడినట్టు ఈ మూడు జట్లతో ఆడితే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకరిద్దరు ఆటగాళ్లపై అతిగా ఆధారపడడం జట్టుకు ఎప్పుడూ మంచిది కాదు. అఫ్గాన్ కాబట్టి గత మ్యాచ్‌లో ఇండియాకు ఎస్కేప్ అయ్యే చాన్సిచ్చింది. అదే టాప్ జట్టయితే మాత్రం ఫలితం వేరేలా ఉండేదేమో. ఏదేమైనా అఫ్గాన్‌తో పోరు కోహ్లీసేనకు ఓ మేలుకొలుపు అనొచ్చు. కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ ‘మిడిల్’సమస్యను వెంటనే పరిష్కరించుకోవాల్సిందే.