తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది. ఈనెల 12 నుంచి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ 3 నెలల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఆగస్టు చివరి వారం నుంచి దసరా వరకు మంచి రోజులు లేకపోవటంతో పెళ్లిళ్లు ఆగిపోయాయి. మధ్యలో సుమారు 45 రోజుల గ్యాప్ వచ్చింది. సీజన్ ప్రారంభం కావడంతో జోరుగా పెళ్లిళ్లు జరగనున్నాయి. ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, బాంకెట్ హాల్స్ ఇప్పటికే బుక్ అయ్యాయి. పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఉదయం, రాత్రి రెండు పూటలా వివాహాలు జరుగుతున్నాయని, బుకింగ్ లు పూర్తయ్యాయని పెళ్లి మండపాల నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో షాపింగ్, గోల్డ్ షాపులు కస్టమర్లతో కళకళలాడగా.. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ తో మరింత రద్దీగా మారనున్నాయి. పెద్దఎత్తున పెళ్లిళ్లు ఉండడంతో.. భజంత్రీలు, బ్యాండ్, డీజేతో పాటు డెకరేషన్, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్ ఏజెంట్లు, పురోహితులకు తీరిక లేకుండా ఆర్డర్లు వస్తున్నాయి. దసరాతో మొదలయ్యే శుభకార్యాలు.. కొత్త ఏడాది వరకు వరుసగా జరగనున్న నేపథ్యంలో వస్త్రాల దుకాణాలు, బంగారం దుకాణాలు కూడా కస్టమర్లతో రష్ గా మారుతున్నాయి.
45 రోజుల పాటు పెళ్లిళ్లు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు అద్దె పెంచారు. ఏడాదిలొ కొన్ని నెలలు మాత్రమే ఫంక్షన్ హాళ్లకు గిరాకీ ఉంటుందని, మిగతా రోజులు అంతా నష్టాలే అని, ఈ నేపథ్యంలోనే అద్దె పెంచామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ మూడు నెలలు పెళ్లిళ్ల వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది.
ఈ సీజన్లో 6 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు :
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ 3 నెలల్లో పెళ్లిళ్ల సందడి అంబరాన్నంటనుంది. నవంబర్ డిసెంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా 48లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( CAIT ) జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ సీజన్ మొత్తానికి పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు సుమారు రూ. 5.9 లక్షల కోట్లుగా ఉండచ్చని అంచనా వేసింది సంస్థ.
ఈ పెళ్లిళ్ల సీజన్లో ఏర్పడనున్న భారీ డిమాండ్ కు అనుగుణంగా వ్యాపారులు సిద్ధమవుతున్నారని తెలిపింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( CAIT ) తెలిపింది. 2023లో నవంబర్, డిసెంబర్ నెలల్లో 35 లక్షల వివాహాలు జరగగా.. మొత్తం ఖర్చు 4.25లక్షలు కాగా.. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 11 పెళ్లి ముహుర్తాలు ఉంటే.. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాల సంఖ్య 18కి పెరిగింది.
Also Read:-18 వందల నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్.. వ్యాపారం మస్త్.. జీఎస్టీ నిల్..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అధ్యయనం ప్రకారం ఒక్క ఢిల్లీలోనే 4.5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయని.. ఈ పెళ్లిళ్ల లావాదేవీలు సుమారు రూ. 1.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది సంస్థ.పెళ్లిళ్లకు మినిమమ్ 3లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. రూ. 1 కోటికి పైగా ఖర్చయ్యే హై ఎండ్ వెడ్డింగ్స్ కూడా చాలానే ఉన్నాయని తెలిపింది సీఐఏటీ.
పెళ్లిళ్ల సీజన్లో దుస్తులు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ఐటమ్స్ వంటి వస్తువులకు భారీగా డిమాండ్ పెరుగుతుందని.. ఇది ఆయా రంగాల్లో గ్రోత్ ని స్పీడప్ చేస్తాయని పేర్కొంది సీఐఏటీ. వీటితో పాటు బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్, ట్రాన్స్పోర్ట్, ఫోటోగ్రఫీ వంటి బిజినెస్ లకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటీవల కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.. పెళ్లిళ్ల కవరేజీ కోసం సోషల్ మీడియాపై కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కొత్త జంటలు.