- 29 బిలియన్ డాలర్లకు తగ్గిన ఎగుమతులు
- 26 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్యలోటు
- ఆరు శాతం మాత్రమే పెరిగిన దిగుమతులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గిపోతుండటంతో మనదేశం నుంచి ఎగుమతులు పడిపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబరులో వీటి విలువ 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లకు పడిపోయింది. వాణిజ్యలోటు మాత్రం 26.91 బిలియన్ డాలర్ల డాలర్లకు తగ్గింది. రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, అన్ని టెక్స్‌టైల్స్, రసాయనాలు, ఫార్మా, సముద్ర ఉత్పత్తులు లెదర్, రెడీమేడ్ వస్త్రాలతో సహా కీలక ఎగుమతి రంగాలు అక్టోబర్‌లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ఇదే నెలలో దిగుమతులు సుమారు 6 శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్ల డాలర్లకు చేరాయి.
ముడి చమురు, పత్తి, ఎరువులు, యంత్రాలు, కొన్ని ముడి పదార్థాల ఇన్‌బౌండ్ షిప్‌మెంట్‌ల పెరుగుదల కారణంగా వీటి విలువ పెరిగింది. 2022 ఏప్రిల్–-అక్టోబర్‌లో ఎగుమతులు 12.55 శాతం వృద్ధితో 263.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 33.12 శాతం పెరిగి 436.81 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022 ఏప్రిల్–-అక్టోబర్ మధ్య సరుకుల వాణిజ్య లోటు 173.46 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. 2021 అక్టోబర్‌లో వాణిజ్య లోటు 17.91 బిలియన్ డాలర్లు ఉంది. చివరిసారిగా 2020 నవంబర్ లో ఎగుమతులు 8.74 శాతం తగ్గాయి.
గ్లోబల్ మార్కెట్లలో ఇబ్బందులే కారణం..
ఈ విషయమై కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ మాట్లాడుతూ గ్లోబల్ మార్కెట్లలో సమస్యలు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రపంచ వాణిజ్య వృద్ధి 2022లో 3.5 శాతం ఉంటుందని, 2023లో కేవలం ఒక శాతం మాత్రమే పెరుగుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా వేసింది. గ్లోబల్ మర్చండైజ్ ట్రేడ్‌లో భారత్ వాటా 1.8 శాతం కాగా, గ్లోబల్ సర్వీసెస్‌లో ఇది 4 శాతంగా ఉందని, దీన్ని పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని సునీల్చెప్పారు. అమెరికా, యూరప్ సెంట్రల్ బ్యాంకుల మానిటరీ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు.
ఆర్థిక వృద్ధితో పాటు దేశీయ వినియోగం పెరగడం మూలధన వస్తువులు, ఇంటర్మీడియట్ ఉత్పత్తుల దిగుమతులకు దారితీస్తోంది. ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతి రంగాలలో.. రత్నాలు, ఆభరణాలు (21.56 శాతం), ఇంజనీరింగ్ (21.26 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు (11.28 శాతం), అన్ని టెక్స్‌టైల్స్ (21.16 శాతం), రసాయనాలు (16.44 శాతం), ఫార్మా (9.24 శాతం), సముద్ర ఉత్పత్తులు (10.83 శాతం), లెదర్ (5.84 శాతం) ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయిల్ సీడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, పొగాకు, టీ బియ్యం వంటి రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.