- శ్వాస సంబంధిత వ్యాధితో కన్నుమూత
- భువనేశ్వర్ జూలో చనిపోయిన బిన్నీ
భువనేశ్వర్: ఇండియాలో ఉన్న ఒకే ఒక్క ఒరాంగుటాన్ చనిపోయింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ శివార్లలోని నందన్ కనన్ జూలో ఉంటున్న 41 ఏళ్ల బిన్నీ అనే ఒరాంగుటాన్ శ్వాస సంబంధిత వ్యాధితో బుధవారం రాత్రి కన్నుమూసింది. బిన్నీ మెడ కింది భాగంలో పెద్ద గడ్డ ఉందని, ఆ గడ్డపై ఎప్పుడు అది గోకుతూ ఉండడంతో మానలేదని జూ వెటర్నరీ డాక్టర్ శరత్ సాహు చెప్పారు. ఇండియాలో ఒరాంగుటాన్లు ఉండవని జూ శాంక్చువరీ మేనేజర్ అలోక్ దాస్ చెప్పారు. 2003లో పుణె నుంచి దానిని భువనేశ్వర్ జూకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పుణెకి సింగపూర్ నుంచి తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు.
ఇండొనేసియాలోని బోర్నియో, సుమత్రా దీవుల్లో ఉన్న ఒరాంగుటాన్‌లకు పామాయిల్ పంటలు ప్రాణాంతకంగా మారుతున్నాయని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ఎన్వీకే అష్రఫ్ చెప్పారు. ఆ దేశం వాటి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒరాంగుటాన్లను వేరే ప్రాంతాలకు తరలిస్తే అవి అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మారే అవకాశం ఉండదని, దాని వల్ల వాటి ప్రాణానికే ప్రమాదం ఉంటుందని, అందుకే ఇండియాలో ఒకే ఒక్క ఒరాంగుటాన్ ఉందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచంలో బోర్నియన్, సుమత్రన్, తపనులి అనే మూడు రకాల ఒరాంగుటాన్లున్నాయి.