బిజినెస్ డెస్క్, వెలుగు : దేశంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కిందటేడాది ఈ సెక్టార్ 3 బిలియన్ డాలర్ల (రూ. 24 వేల కోట్ల) రెవెన్యూని జనరేట్ చేయగా, 2027 నాటికి ఈ నెంబర్ 7 బిలియన్ డాలర్ల (రూ. 56 వేల కోట్ల) కు పెరుగుతుందని కన్సల్టింగ్ కంపెనీ ఎంపీఏ (మీడియా పార్టనర్ ఏసియా) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పుట్టుకొస్తుండడంతో పాటు, గ్లోబల్ ఓటీటీలు కూడా ఇండియా మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ఈ సెక్టార్ మరింతగా విస్తరించనుందని అంచనావేసింది. మొత్తం ఆసియా–పసిఫిక్ రీజియన్‌కు సంబంధించి ఓటీటీ సెక్టార్‌పై ఎంపీఏ తాజాగా ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. రిలయన్స్, బోధి ట్రీ, పారామౌంట్..మూడు ఇన్వెస్ట్ చేసిన వయాకామ్18 సరికొత్తగా మార్కెట్‌లోకి వచ్చింది. అంతేకాకుండా ఐపీఎల్ రైట్స్‌ను దక్కించుకోవడంతో రానున్న కాలంలో దేశ ఓటీటీ సెగ్మెంట్‌లో ఈ ప్లాట్‌ఫామ్ కీలక ప్లేయర్‌గా మారబోతుందని ఎంపీఏ అభిప్రాయపడింది. జియో మొబైల్, కనెక్టడ్ టీవీని వాడుకొని వయాకామ్ 18 మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీంతో పాటు విలీనమైన జీ, సోనీలు అతిపెద్ద టెలివిజన్ నెట్‌వర్క్‌ను, ఆన్‌లైన్ వీడియో బిజినెస్‌ను క్రియేట్ చేయనున్నాయని ఎంపీఏ రిపోర్ట్ భావించింది.
ఆసియా ‑పసిఫిక్ రీజియన్‌లో రెవెన్యూ పైకి..
ఈ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, లోకల్ ప్లేయర్లకు మధ్య పోటీ పెరుగుతోంది. యాడ్ బేస్డ్ ఓటీటీలు (ఏవీఓడీ), తక్కువ రేటుకే సర్వీస్‌లు అందించే ఓటీటీలు (ఏఆర్‌పీయూ), సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓటీటీల(ఎస్‌వీఓడీ) సర్వీస్‌లు ఆసియా– పసిఫిక్ రీజియన్‌లో విస్తరిస్తున్నాయి. ఈ రీజియన్‌లో ఓటీటీల రెవెన్యూ ఈ ఏడాది 16 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి 49.2 బిలియన్ డాలర్ల (రూ. 4 లక్షల కోట్ల) కు చేరుకుంది. ఇందులో చైనా మార్కెట్‌ను పక్కన పెడితే మిగిలిన ఆసియా పసిఫిక్ దేశాల నుంచి ఓటీటీ ఇండస్ట్రీ ఈ ఏడాది 25.6 బిలియన్ డాలర్ల (రూ. 2 లక్షల కోట్ల) రెవెన్యూని జనరేట్ చేయగలిగింది. ఈ రెవెన్యూలో సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓటీటీల వాటా ఎక్కువగా ఉంది. ఆసియా–పసిఫిక్ రీజియన్‌లో ఓటీటీ ఇండస్ట్రీ రెవెన్యూ 2027 నాటికి ఏడాదికి 8 శాతం చొప్పున పెరుగుతూ 72.7 బిలియన్ డాలర్ల (రూ. 5.8 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని ఎంపీఏ రిపోర్ట్ వెల్లడించింది. చైనా మార్కెట్ మినహా మిగిలిన ఆసియా–పసిఫిక్ రీజియన్‌లో ఓటీటీ ఇండస్ట్రీ రెవెన్యూ 2027 నాటికి 42.8 బిలియన్ డాలర్ల (రూ. 3.4 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని వివరించింది.
చైనానే పెద్దది.. కానీ
ఆసియా –పసిఫిక్ రీజియన్‌లో ఓటీటీ ఇండస్ట్రీకి చైనా మార్కెట్ అతిపెద్దదిగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఈ దేశ మార్కెట్ నుంచి 11.2 బిలియన్ డాలర్ల రెవెన్యూని ఓటీటీ కంపెనీలు సంపాదించగలిగాయి. ఇది మొత్తం ఆసియా– పసిఫిక్ రీజియన్ నుంచి ఓటీటీ ఇండస్ట్రీ జనరేట్ చేసిన రెవెన్యూలో 48 శాతానికి సమానం. ఇండోనేషియా మార్కెట్ నుంచి ఒక బిలియన్ డాలర్ రెవెన్యూ జనరేట్ కాగా, ఇండియా మార్కెట్ నుంచి 3 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అయ్యింది. ఈ మార్కెట్‌లలో కూడా యాడ్ బేస్డ్ వీడియో సర్వీస్‌ల వాటానే ఎక్కువగా ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఓటీటీ ఇండస్ట్రీ జనరేట్ చేస్తున్న రెవెన్యూలో 20 ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌ల వాటానే 62 శాతంగా ఉందని ఎంపీఏ రిపోర్ట్ వెల్లడించింది. కానీ, చైనాలోకి గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎంట్రీ లేదు. దీంతో చైనాను మినహాయించి మిగిలిన ఆసియా–పసిఫిక్ రీజియన్‌లో యాడ్ బేస్డ్ వీడియో సర్వీస్‌లలో యూట్యూబ్ టాప్‌లో (42 % మార్కెట్ వాటా) ఉంది. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ వీడియో సర్వీస్‌లలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, అమెజాన్‌లు ముందున్నాయి.
ఆ మూడు విస్తరిస్తున్నాయ్..
ఆసియా–పసిఫిక్ రీజియన్‌లో నెట్‌ఫ్లిక్స్ మిగిలిన గ్లోబల్ ఓటీటీలతో పోలిస్తే తొందరగా సర్వీస్‌లు స్టార్ట్ చేసింది. కొరియన్, జపనీస్ కంటెంట్‌తో 2015–16 టైమ్‌లో కంపెనీ బాగా విస్తరించింది. కానీ, మొత్తం ఓటీటీ రెవెన్యూలో నెట్‌ఫ్లిక్స్ వాటా 2021 లో తగ్గింది. ఇదే టైమ్‌లో డిస్నీ ప్లస్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెవెన్యూ పెరగడం గమనించాలి. ఆస్ట్రేలియా, ఇండియా, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్, జపాన్ మార్కెట్‌లలో లోకల్ కంటెంట్‌పై ఎక్కువ ఇన్వెస్ట్ చేయడంతో డిస్నీ ప్లస్, డీస్నీ హాట్‌స్టార్‌ల రెవెన్యూ పెరుగుతోంది. డిస్నీకి ఆసియా– పసిఫిక్ రీజియన్‌లో మూడో వంతు రెవెన్యూ ఇండియా నుంచే వస్తోంది. కానీ, తాజాగా ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ను ఈ సంస్థ కోల్పోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో జపాన్ మార్కెట్‌లో టాప్‌లో ఉండగా, ఇండియన్ మార్కెట్‌లో కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది దక్షిణాసియాలోని మిగిలిన దేశాల్లో కూడా విస్తరించే పనిలో ఉంది. ‘గ్లోబల్ ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్‌లలో ఆసియా– పసిఫిక్ రీజియన్ కీలకంగా ఉంది. గ్లోబల్ ఓటీటీ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్‌లో ఈ రీజియన్ వాటా ఎక్కువగా ఉంది. యూఎస్, యూరప్ మార్కెట్‌లలో ఇప్పటికే విస్తరించడంతో పాటు చైనా మార్కెట్‌లోకి అనుమతి లేకపోవడంతో ఇండియా, ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయ్‌ల్యాండ్ దేశాల వైపు గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు చూస్తున్నాయి’ అని ఎంపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ కౌటో అన్నారు.