జన భారతం..2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు

జన భారతం..2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు
  • ఆ తర్వాత తగ్గి.. 2100 నాటికి 150 కోట్లకు
  • ప్రస్తుతమున్న జనాభా 145 కోట్లు 
  • ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ప్లేస్​ మనదే 
  • 2080 నాటికి 1,030 కోట్లకుపెరగనున్న ప్రపంచ జనాభా 
  • 2100 నాటికి సగానికి పైగాతగ్గనున్న చైనా పాపులేషన్ 
  • యూఎన్ రిపోర్టులో వెల్లడి

యునైటెడ్ నేషన్స్ : మన దేశ జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. 2060 దాకా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. ఆ నాటికి భారత జనాభా గరిష్ట స్థాయికి చేరుకుని 170 కోట్లు కానుంది. ఇక ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ రానుంది. అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే ఉంటుంది.ఈ మేరకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) వెల్లడించింది.

యూఎన్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ (డీఈఎస్ఏ) గురువారం ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్–2024’ పేరుతో రిపోర్టు విడుదల చేసింది. ఇందులో ప్రపంచ జనాభాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘‘ప్రస్తుతం ఇండియా జనాభా 145 కోట్లుగా అంచనా వేస్తున్నాం. ఇది 2054 నాటికి 169 కోట్లకు చేరుకుంటుంది. 2060 ప్రారంభంలో 170 కోట్లు అవుతుంది.

ఇక ఆ తర్వాత నుంచి జనాభా క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2100 నాటికి జనాభా 12 శాతం తగ్గి 150 కోట్లకు తగ్గుతుంది. అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే కొనసాగుతుంది” అని యూఎన్ రిపోర్టు తెలిపింది. 

30 ఏండ్లలో 20 కోట్లు తగ్గనున్న చైనా జనాభా.. 

రానున్న రోజుల్లో చైనా జనాభా భారీగా తగ్గుతుందని యూఎన్ అంచనా వేసింది. ‘‘జనాభా  పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం చైనా. ఇప్పుడా దేశ జనాభా 141 కోట్లు ఉండగా, 2054 నాటికి 121 కోట్లకు తగ్గనుంది. ఆ తర్వాత మరింత తగ్గి 2100 నాటికి 63.3 కోట్లకు చేరుకోనుంది. 2024 నుంచి 2054 మధ్య చైనా జనాభా ఏకంగా 20.4 కోట్లు తగ్గనుంది” అని వెల్లడించింది. 2100 నాటికి చైనాలో దాదాపు సగానికి పైగా జనాభా తగ్గుతుందని, 1950 చివర్లో ఉన్నప్పటి సంఖ్యకు ఆ దేశ జనాభా చేరుకుంటుందని తెలిపింది. ‘‘ప్రస్తుతం చైనాలో జననాల రేటు చాలా తక్కువగా ఉంది.

ఒక మహిళ తన జీవిత కాలంలో ఒక్క చైల్డ్ కే జన్మనిస్తున్నది. అంటే ఫెర్టిలిటీ రేటు 1గా ఉన్నట్టు. దేశంలో ఇప్పుడున్న జనాభా కొనసాగాలంటే ఫెర్టిలిటీ రేటు 2.1గా ఉండాలి” అని యూఎన్ డీఈఎస్ఏ డైరెక్టర్ జాన్ విల్మోత్ పేర్కొన్నారు. కాగా, 2024 నుంచి 2054 మధ్య చైనాలో 20.4 కోట్ల జనాభా తగ్గనుండగా.. ఆ తర్వాత అత్యధికంగా జపాన్ లో 2.1 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గనున్నట్టు రిపోర్టు తెలిపింది.  

ప్రపంచ జనాభా ఎంతుంటదంటే? 

రానున్న 50 నుంచి 60 ఏండ్లలో ప్రపంచ జనాభా పెరుగుతుందని యూఎన్ అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లు ఉంది. ఇది 2080 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుని 1,030 కోట్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ శతాబ్దం చివరి (2100) నాటికి 1,020 కోట్లకు తగ్గుతుంది” అని తెలిపింది.

రిపోర్టులోని కీలకాంశాలు.. 

ప్రస్తుతం ప్రపంచ జనాభా       820 కోట్లు
2080 నాటికి                                1,030 కోట్లు
ప్రస్తుతం చైనా జనాభా             141 కోట్లు 
2100 నాటికి                                63.3 కోట్లు