కృత్రిమ మేధలో భారత్ పురోగతి.. అగ్రస్థానం ఇండియా‌‌‌దే

కృత్రిమ మేధలో భారత్ పురోగతి.. అగ్రస్థానం ఇండియా‌‌‌దే

భారత్​లోని కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.  ప్రధాన మంత్రి మోదీ మార్గ నిర్దేశకత్వమే ఈ మార్పునకు కేంద్ర బిందువు.  కంప్యూటింగ్ శక్తి, జీపీయూలు, పరిశోధన అవకాశాలు తక్కువ వ్యయంలోనే అందుబాటులో ఉండేలా.. దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వమే నేరుగా కృత్రిమ మేధ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఇది కొద్దిమందికే పరిమితం కాకుండా,  బడా టెక్ కంపెనీలు, అంతర్జాతీయ దిగ్గజాల ఆధిపత్యం లేకుండా  మోదీ  ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

  అంతర్జాతీయ స్థాయి ఏఐ మౌలిక సదుపాయాలను విద్యార్థులు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలకు అందుబాటులోకి తెచ్చి  క్షేత్రస్థాయి విధానాల ద్వారా ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించింది.  ఇండియా ఏఐ మిషన్,  అత్యున్నత  ఏఐ  విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పడంతోపాటు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ దేశంలో ఆ రంగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినవే. కృత్రిమ మేధలో భారత్​ను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నతంగా నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 

ఇండియా ఏఐ మిషన్..  కృత్రిమ మేధ 

అందుబాటులో ఉండేలా మార్గ నిర్దేశకత్వం, భారత కృత్రిమ మేధ రంగాన్ని బలోపేతం చేసే దిశగా మోదీ ప్రభుత్వం వేసిన ముఖ్యమైన ముందడుగు.  2024లో  రూ.10,300 కోట్లతో ఇండియా ఏఐ మిషన్​ను  కేంద్రం ఆమోదించింది.  ఈ నిధులు వచ్చే ఐదేళ్లలో మిషన్​లోని  వివిధ భాగాల అభివృద్ధికి ఊతమిస్తాయి. అత్యున్నత స్థాయి ఉమ్మడి కంప్యూటింగ్ ఫెసిలిటీ సహకారంతో.. భారతీయ భాషలను ఉపయోగించి భారతీయ నేపథ్యానికి తగినట్టుగా అనతికాలంలోనే ఇండియా ఏఐ మిషన్ దేశీయ ఏఐ వివరణలను అందించబోతోంది.  దాదాపు 10,000 జీపీయూల  కంప్యూటేషన్  ఫెసిలిటీతో కృత్రిమ మేధ నమూనా ప్రారంభమవుతోంది.  

త్వరలోనే మిగతా 8,693 జీపీయూలు అందుబాటులోకి వస్తాయి. సార్వత్రిక జీపీయూ మార్కెట్ ఇండియా ఏఐ మిషన్ ప్రారంభించిన 10 నెలల్లోనే సంబంధిత మంత్రిత్వ శాఖకు అపూర్వ స్పందన లభించింది. దాదాపు 18,693 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) సామర్థ్యంతో ఉన్నతస్థాయి, బలమైన కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ సోర్స్ మోడల్  డీప్ సీక్​కు ఉన్నదాని కన్నా దాదాపు తొమ్మిది రెట్లు, చాట్ జీపీటీకి ఉన్నఫెసిలిటీలో మూడింట రెండో వంతు.  కాగా,  భారత జీపీయూ మార్కెట్​కు మోదీ ప్రభుత్వం మార్గనిర్దేశం చేసింది.  

ప్రపంచంలో జీపీయూ మార్కెట్​ను ప్రారంభించిన మొదటి ప్రభుత్వం  మోదీ సర్కారు.  కృత్రిమ మేధ అభివృద్ధి కోసం 18,000 అత్యుత్తమ జీపీయూ ఆధారిత కంప్యూటింగ్ ఫెసిలిటీలను దేశంలోని సంస్థలకు త్వరలో  మోదీ ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. అందులో 10,000 ఫెసిలిటీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 18,693 జీపీయూలను సరఫరా చేయడం కోసం 10 కంపెనీలను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది.  వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో సొంత గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)ను భారత్ అభివృద్ధి చేయబోతోంది. అంకుర సంస్థలు, పరిశోధకులకు కంప్యూటింగ్  పవర్ అందుబాటులో ఉండేలా త్వరలోనే ఓ కామన్ కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రభుత్వం ప్రారంభించనుంది. అంతర్జాతీయంగా జీపీయూ కోసం గంటకు దాదాపు 2.5 నుంచి 3 డాలర్లు ఖర్చవుతుండగా, మోదీ ప్రభుత్వం దానిని గంటకు ఒక డాలరుకే అందించబోతోంది. 

ఇండియా ఏఐ సమాచార వేదిక

భారీగా, వైవిధ్యంతో కూడిన, విస్తృతమైన సమాచారం అందుబాటులో లేకపోతే అత్యంత నిపుణులైన డేటా సైంటిస్టులు, డెవలపర్లు కూడా పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  దీన్ని గుర్తించిన  మోదీ ప్రభుత్వం సార్వత్రిక సమాచార వనరులను విస్తృతమైన పరిశోధక సమాజానికి అందుబాటులోకి తెచ్చేలా క్రియాశీలకంగా కృషి చేస్తోంది. ఇండియా ఏఐ సమాచార వేదిక ద్వారా నాణ్యత కలిగిన, వ్యక్తిగత యేతర సమాచార వనరుల లభ్యతను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  ఏఐ  ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ భారతీయ అంకుర సంస్థలు, పరిశోధకులకు నిరంతరాయంగా డేటా అందుబాటులో ఉండేలా ఓ ఏకీకృత డేటా వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.  

ఏఐ సమాచార వేదికలో సమాచారం విస్తృతంగా ఉంటుంది. ఆరోగ్య రక్షణ, వ్యవసాయం, పర్యావరణహిత నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తూ ఢిల్లీలో మూడు అత్యున్నత ఏఐ విజ్ఞాన కేంద్రాలను (సీవోఈ) నెలకొల్పుతామని 2023లో  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.500 కోట్లతో విద్యకు సంబంధించి ఒక అత్యున్నత  ఏఐ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  తాజా బడ్జెట్​లో ప్రభుత్వం ప్రకటించింది.    ‘మేక్ ఫర్ ఇండియా,  మేక్ ఫర్ ది వరల్డ్’లో  భాగంగా తయారీకి ఊతమిచ్చే విధంగా అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.  

భారత ప్రాథమిక విస్తృత భాషా నమూనాలు 

భారత ఏఐ ఆధారిత భాషా అనువాద వేదిక ‘డిజిటల్ ఇండియా భాషిణి’.  ఇది వాయిస్ ఆధారిత సేవలు సహా భారతీయ భాషల్లో ఇంటర్నెట్,  డిజిటల్  సేవలను  సులభంగా అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించినది. భారతీయ భాషల్లో  కంటెంటును 
రూపొందించడంలో  దోహదపడుతుంది.  ప్రపంచంలో  మొదటిసారిగా  ప్రభుత్వ నిధులతో నడుస్తున్న మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం కార్యక్రమం భారత్ జెన్.  ఇదొక ఉత్పాదక ఏఐ. 2024లో  ఢిల్లీలో  దీన్ని ప్రారంభించారు.  భాష, మాటలు, కంప్యూటర్  దృక్పథాల్లో  వివిధ  ప్రాథమిక నమూనాలను అభివృద్ధి చేయడం ద్వారా  

ప్రజాసేవల్లో విప్లవాత్మకమైన మార్పులు 

తేవడానికి, పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమమిది. దేశంలోని ప్రముఖ 
విద్యాసంస్థల నుంచి అగ్రశ్రేణి పరిశోధకుల బృందం భారత్ జెన్ లో ఉంటుంది.  చిత్రలేఖ అనేది ఏఐ4  భారత్  రూపొందించిన ఓపెన్ సోర్స్ వీడియో  రూపాంతర వేదిక. ఇది ఏఐ ఆధారిత వీడియో ప్రాసెసింగ్​లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. 


ఎస్ఎంఎల్ కు చెందిన హనూమాన్ ఎవరెస్ట్ 1.0ను ఆవిష్కరించింది. హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో సేవలందించడానికి రూపొందించిన బహుముఖీన బహుభాషా కృత్రిమ మేధ వ్యవస్థ ఇది. ప్రస్తుతం 35 భాషలకు అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ త్వరలోనే 90 భాషలకు విస్తరించనుంది.  కృత్రిమ మేధ సంబంధిత విద్యను అన్ని వర్గాలవారికి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం రెండో  అంచె, మూడో అంచె నగరాల్లో డేటా, కృత్రిమ మేధ ల్యాబ్​లను ఏర్పాటు చేస్తోంది.  ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ)లో ఒక నమూనా ఇండియా ఏఐ డేటా ల్యాబ్​ను  ఇప్పటికే ఏర్పాటు చేశారు. 

ఆక్సిలరేటర్ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో వృద్ధి

భారతదేశంలో కృత్రిమ మేధ విపణి చాలా వేగంగా వృద్ధి చెందుతోందని బీసీజీ -నాస్కామ్ 2024 సంవత్సర నివేదిక తెలిపింది.  కృత్రిమ మేధ విపణి 25 నుంచి 35 శాతం మేరకు కాంపౌండెడ్ ఏన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో దూసుకుపోతూ,  నవకల్పనకు,  ఉద్యోగాల కల్పన సంబంధిత సామర్థ్యానికి పెద్ద పీట  వేయనుంది. భారత్‌‌‌‌లో ప్రస్తుతం 520కి పైగా టెక్ ఇన్‌‌‌‌క్యూబేటర్లతోపాటు ఆక్సిలరేటర్లు (సత్వర వృద్ధి కారకాలు) ఉన్నాయి. 

ప్రపంచంలో క‌‌‌‌ృత్రిమ మేధ రంగంలోని మొత్తం క్రియాశీల ప్రోగ్రాముల్లో మూడో అతి పెద్ద సంఖ్యలోని ప్రోగ్రాములు భారత్‌‌‌‌లో రూపొందాయి. వీటిలో 42 శాతం ప్రోగ్రాములను గత 5ఏండ్లలో భారతీయ అంకుర సంస్థల అవసరాలను తీర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.  టి-హబ్ మేథ్ వంటి ఆక్సిలరేటర్లు ఉత్పాదనలను అభివృద్దిపరచడంలో, వ్యాపార వ్యూహాలను అమలుచేయడంలో, స్కేలింగులో ఏఐ అంకుర సంస్థలకు కీలక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. 

అగ్రస్థానం భారత్‌‌‌‌దే 

స్టాన్‌‌‌‌ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2024 చెబుతున్న దాని ప్రకారం, కృత్రిమ మేధ నైపుణ్యాల వ్యాప్తిలో భారత్ ప్రపంచంలో ఇతర దేశాలన్నిటి కన్నా ముందుంది. ఈ కొలమానంలో భారత్ స్కోరు 2.8 గా ఉంది. ఇది అమెరికా స్కోరు 2.2,  జర్మనీ స్కోరు 1.9 కన్నా  అధికం.  మన దేశం 2016 నుంచి  కృత్రిమ మేధ  ప్రతిభలో చెప్పుకోదగ్గ విధంగా వృద్ధిని కనబరచింది. ఇది కృత్రిమ మేధ రంగంలో భారత్‌‌‌‌ను ప్రపంచంలో ఒక ప్రధాన పాత్రధారిగా నిలబెట్టింది.   మహిళల్లో కృత్రిమ మేధ నైపుణ్యాల సాధన తీరుతెన్నుల కోణంలో నుంచి  చూసినా కూడా 1.7 శాతం విస్తృతి రేటుతో భారత్ అగ్రగామిగా ఉంది. 

ఈ విషయంలో 1.2 విస్తృతి రేటుతో అమెరికా, 0.9 శాతం విస్తృతి రేటుతో  ఇజ్రాయెల్​లు తరువాత స్థానాల్లో నిలిచాయి. భారతదేశ కృత్రిమ మేధ పరిశ్రమ 45 శాతం కాంపౌండ్ ఏన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో 2025కల్లా 28.8 బిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయిని అందుకొంటుందని ‘ఇండియా స్కిల్స్ రిపోర్డ్ 2024’ పేరిట వీబాక్స్ (Wheebox) రూపొందించిన నివేదిక చెబుతోంది. దీనికి అదనంగా, భారత్‌‌‌‌లో కృత్రిమ మేధ సంబంధిత నైపుణ్యాల్ని సంపాదించుకొన్న ఉద్యోగులలో.. 2016 నుంచి 2023 మధ్య.. 14 రెట్ల వృద్ధి ఉందని కూడా ఈ నివేదిక తెలిపింది.  అయిదు అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న కృత్రిమ మేధ ప్రతిభా కూడళ్ల (ఏఐ టాలెంట్ హబ్స్)లో ఒకటిగా ఉంది. మన దేశంలో కృత్రిమ మేధ వృత్తి నిపుణులకు గిరాకీ 2026 కల్లా సుమారు పది లక్షలకు చేరుకోవచ్చని అంచనా. బీసీజీ రూపొందించిన ఇటీవలి ఒక నివేదికలో పేర్కొన్న ప్రకారం కృత్రిమ మేధ సేవల్ని పొందుతుండడంలో భారత్ అగ్రగామిగా ఉంది. 

- ప్రధాన మంత్రి  
కార్యాలయం,
  (పీఎంఓ) ఢిల్లీ