- అక్టోబర్‌లో రూ. 41,887 కోట్లు
- సిప్‌లలోకి రూ. 25,323 కోట్లు
- 17.23 కోట్లకు చేరిన రిటైల్ ఫోలియోల సంఖ్య
న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు ఉంటున్నా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధుల వరద మాత్రం ఆగడం లేదు. ఇవి అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ. 41,887 కోట్ల ఇన్‌ఫ్లోను సాధించాయి. నెలవారీ ప్రాతిపదికన 21.7 శాతం వృద్ధి కనిపించింది. ఈక్విటీ- ఆధారిత ఫండ్‌లలో వరుసగా 44వ నెలలోనూ నికర ఇన్‌ఫ్లో పెరిగింది. పెట్టుబడిదారులలో మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) పేర్కొంది.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) నుంచి నెలవారీ విరాళాలు సెప్టెంబరులో రూ. 24,509 కోట్ల నుంచి గత నెలలో రూ. 25,323 కోట్ల ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగాయి. రిటైల్ఫోలియోల సంఖ్య 17.23 కోట్ల చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. 10.12 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చలసాని వెంకట్ అన్నారు. కాగా, సిప్ అనేది ఒక పెట్టుబడి విధానం. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత నెలలో భారీగా రూ. 94 వేల కోట్లను వెనక్కి తీసుకున్నప్పటికీ, ఎంఎఫ్‌లలోకి పెట్టుబడులు మాత్రం ఆగలేదని, రిటైల్ పెట్టుబడిదారులు 40 వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారని జెర్మినేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈఓ సంతోష్ జోసెఫ్ అన్నారు. ఈక్విటీ- ఆధారిత పథకాల్లోకి అక్టోబర్‌లో రూ. 41,887 కోట్లు వచ్చాయి. నెలవారీగా 21.7 శాతం వృద్ధి ఉంది. అక్టోబర్‌లో ఫోలియోల సంఖ్య 39.47 లక్షలు పెరిగింది.
స్టాక్మార్కెట్కే మా ఓటు
మనదేశ యువ ఇన్వెస్టర్లలో అత్యధికులు మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోకుండా ఈక్విటీ మార్కెట్‌లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక రిపోర్ట్ తెలిపింది. ఫిన్‌టెక్ బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ చొరవతో రూపొందించిన ఫిన్ వన్ రిపోర్ట్ ప్రకారం, 93 శాతం మంది యువకులు స్థిరంగా పొదుపు చేస్తున్నారు. వీరిలో మెజారిటీ వారి నెలవారీ ఆదాయంలో 20-30 శాతం ఆదా చేస్తున్నారు.
ఎంఎఫ్‌ల కంటే స్టాక్స్ఇష్టమని అత్యధికులు చెప్పారు. అయితే 45 శాతం మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా బంగారం వంటి వాటిలో మదుపు చేస్తామన్నారు. 58 శాతం మంది భారతీయ యువ పెట్టుబడిదారులు ప్రస్తుతం స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుండగా, 39 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్‌కు అనుకూలంగా ఉన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టామని 22 శాతం, రికరింగ్ డిపాజిట్లలో పెట్టామని 26 శాతం వెల్లడించారు. ఈ రిపోర్ట్ తయారీకి 13 కంటే ఎక్కువ భారతీయ నగరాల్లోని 1,600 మంది యువత నుంచి వివరాలను తీసుకున్నామని ఏంజెల్ వన్ తెలిపింది.