
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్ఫ్లేషన్ మార్చిలో స్వల్పంగా తగ్గి దాదాపు 6 సంవత్సరాల కనిష్ట స్థాయి 3.34 శాతానికి చేరుకుంది. కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ఆధారిత ఇన్ఫ్లేషన్ ఫిబ్రవరిలో 3.61 శాతం ఉండగా, గత సంవత్సరం మార్చిలో 4.85 శాతంగా ఉంది.
ఈ ఏడాది మార్చిలో ద్రవ్యోల్బణ రేటు ఆగస్టు 2019 తర్వాత అతి తక్కువగా ఉంది. అప్పుడు ఇది 3.28 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో 3.75 శాతం ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గడంతో ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఆర్నెళ్ల కనిష్టానికి టోకు ధరల ఇన్ప్లేషన్
కూరగాయలు, బంగాళాదుంపలు ఇతర ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ఈ ఏడాది మార్చిలో టోకు ధరల ఇన్ఫ్లేషన్ 6 నెలల కనిష్ట స్థాయి 2.05 శాతానికి తగ్గింది. ఫిబ్రవరిలో టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ఆధారిత ఇన్ఫ్లేషన్ 2.38 శాతంగా ఉంది. గత ఏడాది మార్చిలో ఇది 0.26 శాతంగా ఉంది.
ప్రస్తుత ఏడాది మార్చిలో ఇన్ఫ్లేషన్ సానుకూలంగా ఉండటానికి ఆహార ఉత్పత్తులు, విద్యుత్, దుస్తులు మొదలైన వాటి ధరల్లో మార్పులు కారణమని పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.