- కేంద్ర విద్యాశాఖ రిపోర్టులో వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గుతోంది. నాలుగు ఏండ్లతో పోలిస్తే ఒక్క 2023=24 సంవత్సరంలోనే కోటి మంది పిల్లలు తగ్గిపోయారు. 2018 నుంచి 2022 దాకా బడిలో చేరే పిల్లల సంఖ్య యావరేజ్‌గా 26 కోట్లు ఉండగా, ఈ సంఖ్య 2022=2023లో 25.17 కోట్లకు, 2023=24లో 24.8 కోట్లకు పడిపోయిందని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది.
2018 నుంచి 2022 దాకా స్కూళ్లలో నమోదు సంఖ్య ఏటా 26 కోట్లు దాటిందని చెప్పింది. 2020=2021లో కరోనా సమయంలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, 2023, 2024 సంవత్సరాల్లోనే ఇంతటి స్థాయిలో పిల్లల చేరికల సంఖ్య పడిపోవడం ఆందోళనకరమని పేర్కొంది.
అత్యంత తక్కువగా బీహార్‌లో..
బడిలో అడ్మిట్ అయ్యే పిల్లల సంఖ్య అత్యంత తక్కువగా బీహార్‌లో నమోదైంది. నాలుగేండ్లతో పోలిస్తే గతేడాది 35.65 లక్షలు తగ్గింది. ఆపై ఉత్తరప్రదేశ్‌లో 28.26 లక్షలు, మహారాష్ట్రలో 18.55 లక్షలు పడిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ మినహా చాలా రాష్ట్రాలు, యూటీల్లో స్టూడెంట్ల అడ్మిషన్లు తగ్గినట్లు రిపోర్టు వెల్లడించింది.
2018 నుంచి 2022 దాకా దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏటా 13.50 కోట్ల మంది అడ్మిట్ కాగా, 2023=24లో మాత్రం ఆ సంఖ్య 12.74 కోట్లకు తగ్గిపోయింది. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలోనూ అడ్మిషన్లు 9.34 కోట్ల నుంచి 9 కోట్లకు పడిపోయాయి. బడిలో చేరే పిల్లల శాతం ఓవరాల్‌గా ప్రభుత్వ స్కూళ్లలో 5.59 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 3.67శాతం తగ్గిపోయినట్లు విద్యాశాఖ రిపోర్టు తెలిపింది. అయితే, ప్రీ ప్రైమరీ, ఇంటర్ స్థాయిలో మాత్రం స్టూడెంట్ల చేరిక గణనీయంగా పెరిగిందని చెప్పింది.