ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ పై మ్యాచ్ అంటే టీమిండియాకు పూనకం వస్తుందేమో. టోర్నీ ఫలితాలు ఎలా ఉన్నా పాకిస్థాన్ పై మాత్రం పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగులతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. దీంతో టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై విజయాల సంఖ్య 7 కు పెంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ గెలవడంతో పాటు ఒక అరుదైన రికార్డ్ ను తమ పేరిట లిఖించుకుంది.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 7 సార్లు విజయం సాధిస్తే.. పాక్ ఒక మ్యాచ్ లో నెగ్గింది. దీంతో టీ20 వరల్డ్ కప్ లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డ్ తమ ఖాతాలో వేసుకుంది. 2021 లో దుబాయ్ వేదికగా జరిగిన వరల్డ్ లో మాత్రమే భారత్ పై పాకిస్థాన్ నెగ్గింది. ఏ ఈ లిస్ట్ లో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ 6 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. టీ20 వరల్డ్ కప్ లో అతి తక్కువ లక్ష్యాన్ని ఈ మ్యాచ్ లోనే డిఫెండ్ చేసుకోవడం విశేషం.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా 19 ఓవర్లలో 119 రన్స్‌కే ఆలౌటైంది. రిషబ్ పంత్ (31 బాల్స్‌లో 6 ఫోర్లతో 42) సత్తా చాటగా, అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు, మహ్మద్ఆమిర్ రెండు వికెట్ల దెబ్బకొట్టారు. ఛేజింగ్‌లో పాక్ ఓవర్లన్నీ ఆడి 113/7 స్కోరు చేసి ఓడింది. మహ్మద్ రిజ్వాన్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా (2/24), అక్షర్ పటేల్ (1/11) రాణించారు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.