మహిళల ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై 110 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాను 40.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ చేసింది మిథాలీ సేన. భారత బౌలర్లు విజృంభించారు. స్నేహ్ రాణా 4 వికెట్లు పడగొట్టగా... జూలన్ గోస్వామి, పూజాకు చెరో 2 వికెట్లు దక్కాయి. రాజేశ్వరి, పూనమ్ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకున సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. యస్తిక భాటియా అర్ధశతకంతో రాణించింది. మిగతా బ్యాటర్లలో షెఫాలీ వర్మ 42, స్మృతి మంధాన 30 పరుగులు చేశారు. మిథాలీ రాజ్ డక్ ఔట్ కాగా.. హర్మన్ కౌర్ 14 పరుగులు, రిచా ఘోష్ 26 పరుగులు, స్నేహ్ రాణా 27 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రీతు మోనికి 3 వికెట్లు నహిదా కు 2, జహనర కు ఒక వికెట్ దక్కింది.