- కుల్దీప్, షమీకి చాన్స్.. ఫిట్‌నెస్ ఉంటేనే బుమ్రా బరిలోకి
- చాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో వన్డేలకు టీమ్ ఎంపిక
ముంబై: టాలెంటెడ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియా వన్డే టీమ్ నుంచి తొలిసారి పిలుపు అందుకున్నాడు. వచ్చే నెల 19 నుంచి జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేసిన సెలెక్టర్లు గాయం నుంచి కోలుకున్న వెటరన్ మహ్మద్ షమీతో పాటు లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం టీమ్‌కు ఎంపికైనప్పటికీ.. ఫిట్‌నెస్‌తో ఉంటేనే అతను మెగా టోర్నీలోకి బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.
శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. ఇదే జట్టు స్వదేశంలో వచ్చే నెల 6, 9, 12వ తేదీల్లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పోటీ పడుతుందని ప్రకటించింది. ఆల్‌రౌండర్ హర్షిత్ రాణాను కేవలం ఇంగ్లండ్‌తో వన్డేలకు మాత్రమే తీసుకుంది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో వెన్నునొప్పికి గురైన బుమ్రాను ఐదు వారాల విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ మెడికల్ టీమ్ సూచించిందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ఇంగ్లిష్ టీమ్‌తో తొలి రెండు వన్డేలకు అతను దూరంగా ఉంటాడని చెప్పాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో బుమ్రాను ఆడించి చాంపియన్స్ ట్రోఫీకి అతను ఫిట్‌నెస్‌తో ఉన్నాడో లేదో తేల్చనున్నారు.
ఆల్‌రౌండర్లకు మొగ్గు
కెప్టెన్ రోహిత్, కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్ ఆటోమేటిక్ చాయిస్ కాగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తుండటంతో జైస్వాల్‌కు వన్డే ఫార్మాట్‌లోనూ చాన్స్ లభించింది. లెఫ్టాండర్‌గా తను టాపార్డర్‌లో వైవిధ్యం తీసుకురానున్నాడు. గాయం నుంచి కోలుకున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్న సెలెక్టర్లు ఈసారి ఆల్‌రౌండర్లకు పెద్ద పీట వేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తిరిగి వన్డేల్లోకి వచ్చాడు.
అనుభవజ్ఞులైన ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. కుల్దీప్ కూడా ఉండటంతో ఇండియా మొత్తంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీలో ఇండియా తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. అక్కడి వికెట్లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. ఇక, రెండేండ్ల కిందట తన చివరి వన్డే మ్యాచ్ ఆడిన రిషబ్ పంత్‌ను ఫస్ట్ చాయిస్ కీపర్‌గా తీసుకున్న సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌ను బ్యాకప్ కీపర్–బ్యాటర్ ఆప్షన్‌గా ఉంచారు. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నారు.
కరుణ్ నాయర్‌ను కరుణించలే..
విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో ఐదు సెంచరీలు సహా 779 రన్స్ చేసి దుమ్మురేపిన కరుణ్ నాయర్‌ను సెలెక్టర్లు మరోసారి విస్మరించారు. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాతి టెస్టులోనే ఇండియా టీమ్ నుంచి వేటు ఎదుర్కొన్న నాయర్ తిరిగి నేషనల్ టీమ్‌లోకి వచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో దంచికొడుతున్నాడు. ఇప్పుడు హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్‌గా సూపర్ ఫామ్ చూపెట్టడంతో తను జట్టులోకి వస్తాడని, కనీసం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కైనా ఎంపిక చేస్తారని ఆశిస్తే మళ్లీ నిరాశే మిగిలింది.
ఇండియా టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్, జడేజా;
హర్షిత్ రాణా (ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు మాత్రమే)
సిరాజ్‌ది దురదృష్టం: రోహిత్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిరాజ్‌ను ఎంపిక చేయని సెలెక్టర్లు చాంపియన్స్ ట్రోఫీకి సైతం పక్కనబెట్టారు. ఇంగ్లండ్‌తో వన్డేలకు కూడా చాన్స్ ఇవ్వకుండా హర్షిత్ రాణాను ఎంపిక చేయడం చూస్తే వైట్ బాల్ ఫార్మాట్ నుంచి సిరాజ్‌ను పూర్తిగా తప్పించినట్టు తెలుస్తోంది. పాత బంతితో మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోవడం వల్లే సిరాజ్‌పై వేటు పడినట్టు అర్థం అవుతోంది. సిరాజ్ గైర్హాజరీలో జట్టు ఓ అనుభవజ్ఞుడిని కోల్పోతోందని కెప్టెన్ రోహిత్ అన్నాడు.
అయితే, టీమ్‌లో ముగ్గురు సీమర్లు మాత్రమే ఉండాలని, ఆల్‌రౌండర్లకు అవకాశం ఇవ్వాలని అనుకోవడం వల్లే సిరాజ్‌ను తప్పించాల్సి వచ్చిందని తెలిపాడు. అదే సమయంలో పాత బంతితో తను మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడని చెప్పాడు. సిరాజ్‌ది దురదృష్టమని, ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచలేమని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ టైమ్‌కు బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో తెలియకపోయినా.. అతని అనుభవం జట్టుకు అవసరమైనందునే ఎంపిక చేశామన్నాడు.