మెల్‌బోర్న్: ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ని తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ మొదటి పోరులో 91వ ర్యాంకర్ సుమిత్ 3–6, 1–6, 5–7తో వరుస సెట్లలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 25వ ర్యాంకర్ టొమాస్ మచాక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లలో తేలిపోయిన ఇండియా ప్లేయర్.. మూడో సెట్‌లో కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది.
రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో 6–4, 6–4, 6–4తో ఫ్రాన్స్ ప్లేయర్ లూకా పౌలీపై గెలిచి రెండో రౌండ్ చేరాడు. ఆరో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–6, 7–5, 2–6, 6–1తో స్పెయిన్‌కు చెందిన జామె మునార్‌పై గెలిచాడు. జపాన్ స్టార్ కీ నిషికోరి 4–6, 6–7 (4/7), 7–5, 6–2, 6–3తో తియామో మోంటోరియో (బ్రెజిల్)పై ఐదు సెట్ల పాటు పోరాడి గట్టెక్కాడు. విమెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–2, 6–2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై ఈజీగా గెలిచింది. ఐదో సీడ్ క్విన్వెన్ జెంగ్ (చైనా) 7–6 (7/3), 6–1తో అంకా టొడోని (రొమేనియా)ను ఓడించింది.