టాటా టెక్నాలజీస్​ .. ఐపీఓ ధర రూ. 500

ముంబై: టాటా టెక్నాలజీస్​ ఐపీఓ (ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​) ధరను రూ. 475–500 గా నిర్ణయించారు. ఈ ఐపీఓ నుంచి రూ. 3,042 కోట్లను కంపెనీ సమీకరించనుంది. నవంబర్​ 22 నుంచి 24 దాకా సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉంటుంది. యాంకర్ బుక్​ నవంబర్​ 21 నుంచే ఓపెన్​లో ఉంటుందని టాటా టెక్నాలజీస్​ వెల్లడించింది. టాటా గ్రూప్​లోని ఏదైనా కంపెనీ నుంచి ఐపీఓ రావడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ గ్రూప్​ నుంచి చివరగా 2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) ఐపీఓకి వచ్చింది. 

టాటా టెక్నాలజీస్​ ఐపీఓ అంతా ఆఫర్​ ఫర్​ సేల్​ (ఓఎఫ్ఎస్​) రూపంలోనే ఉండనుంది. కంపెనీలో ప్రమోటర్​గా ఉన్న టాటా మోటార్స్​, ఇన్వెస్టర్లు ఆల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్​ గ్రోత్​ ఫండ్​ 1 లు తమ షేర్లను ఆఫర్​ ఫర్​ సేల్​లో ఉంచుతున్నాయి. అంటే, ఐపీఓ డబ్బులో ఒక్క రూపాయి కూడా కంపెనీ అకౌంట్​లోకి రాదన్నమాట. టాటా మోటార్స్​ 4.63 కోట్ల షేర్లను (11.4 శాతం వాటా), ఆల్ఫా టీసీ హోల్డింగ్స్​ 97.17 లక్షల షేర్లు (2.4 శాతం), టాటా క్యాపిటల్​ గ్రోత్​ ఫండ్  48.58 లక్షల షేర్లను (1.2 శాతం)  ఆఫర్​ ఫర్​ సేల్​ కింద అమ్మనున్నాయి. 

రూ.500 వద్ద ఐపీఓ సబ్​స్క్రయిబ్​ అవుతుందనుకుంటే మొత్తం రూ. 3.042.5 కోట్లను సమీకరించినట్లవుతుంది. ఐపీఓలో 20.28 లక్షల షేర్లను ఉద్యోగుల కోసం, 60.85 లక్షల షేర్లను టాటా మోటార్స్​ షేర్​హోల్డర్స్​ కోసం రిజర్వ్​ చేస్తున్నట్లు టాటా టెక్నాలజీస్​ వెల్లడించింది. కనీసం 30 షేర్లకు ఇన్వెస్టర్లు బిడ్​ వేయాల్సి ఉంటుంది. ఐపీఓ తర్వాత టాటా టెక్నాలజీస్​ మార్కెట్​ విలువ సుమారు  రూ. 20 వేల కోట్లకు చేరుతుందని యాక్సిస్​ క్యాపిటల్​ అంచనా వేస్తోంది. టాటా టెక్నాలజీస్​లోని తన వాటాలో 9.9 శాతాన్ని టీపీజీ రైజ్​ క్లైమేట్​కు రూ. 1,613.7 కోట్లకు అమ్మేందుకు టాటా మోటార్స్​ కిందటి నెలలోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్​ ఒరిజినల్ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్లకు అవసరమైన ప్రొడక్ట్​ డెవలప్​మెంట్​, డిజిటల్​ సొల్యూషన్స్​ను టాటా టెక్నాలజీస్​ అందిస్తోంది.  ఈ రంగంలో కంపెనీకి 20 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా ఆటోమోటివ్​ ఇండస్ట్రీలో నైపుణ్యం ఈ కంపెనీ సొంతం. నవంబర్​30 లేదా డిసెంబర్​ 1 టాటా టెక్నాలజీస్​ షేర్లను లిస్టింగ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారు.

గ్రే మార్కెట్లో డిమాండ్​ ఫుల్లు...

మరోవైపు  ఐపీఓకి ముందే టాటా టెక్నాలజీస్ షేర్లకు అన్​లిస్టెడ్ మార్కెట్లో మంచి డిమాండ్​ కనిపిస్తోందని మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు. ఈ కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ. 298  ప్రీమియంతో (ఐపీఓ ధర కంటే ఎక్కువ)  ట్రేడవుతున్నాయని అంటున్నారు. ఈ గ్రే మార్కెట్​ ప్రీమియం ఒక ఇండికేటర్​ మాత్రమేనని,  ఐపీఓ షేర్లు అదే ధర వద్ద లిస్ట్ అవుతాయని చెప్పలేమని పేర్కొంటున్నారు. 

ALSO READ: షాద్​నగర్​లో బీఆర్ఎస్​ను ఓడించి తీరుతాం : వీర్లపల్లి శంకర్

9 వేల మంది ఉద్యోగులు

టాటా టెక్నాలజీస్​లో 9 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, గ్రూప్​లోని  జేఎల్​ఆర్ టాటా మోటార్స్​ క్యాప్టివ్​ క్లయింట్‌గా కొనసాగుతోంది. 2022 లో కంపెనీ రెవెన్యూ 46 శాతం పెరిగింది. ఇంత ఎక్కువ గ్రోత్​ను అంతకు ముందు ఎప్పుడూ కంపెనీ రికార్డు చేయలేదు. ఇక ఈ ఏడాదికి  చూస్తే రెవెన్యూ, లాభం రెండంకెల గ్రోత్​ సాధించినట్లు టాటా టెక్నాలజీస్​ సీనియర్​ ఆఫీసర్లు గురువారం మీడియాకు చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆపరేటింగ్​ మార్జిన్లు సైతం 300 బేసిస్​ పాయింట్లు మెరుగుపడి 19.2 శాతానికి చేరినట్లు వారు వివరించారు.​