
పారిస్ : ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ బోపన్న (ఇండియా)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 6–7 (2/7), 6–3, 7–6 (10/8)తో శ్రీరామ్ బాలాజీ (ఇండియా)–రెయెస్ మార్టినేజ్ (మెక్సికో)పై సూపర్ టై బ్రేక్‌లో అద్భుత విజయం సాధించారు. మెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంప్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) అతి కష్టంగా క్వార్టర్ ఫైనల్ చేరగా..
ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. టాప్ సీడ్ జొకో 6-–1, 5–-7, 3–-6, 7–-5,6–3తో అర్జెంటీనాకు చెందిన 23వ సీడ్ ఫ్రాన్సిస్కో సెరుండొలోపై ఐదు సెట్ల పాటు పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–4, 2–6, 1–6, 3–6తో 11వ సీడ్ డి మిన్వార్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.
రెండో సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) 2–6, 6–3, 6–2, 6–1తో మౌలెట్ (ఫ్రాన్స్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. విమెన్స్ సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 6–2, 6–3తో 22వ సీడ్ నవారో (అమెరికా)ను, నాలుగో సీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్) 6–4, 6–3తో స్వితోలినా(ఉక్రెయిన్)ను ఓడించి క్వార్టర్స్ లో అడుగు పెట్టారు.