- ఒత్తిడిలో రోహిత్‌సేన
- ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్
ముంబై : వరుసగా 18 సిరీస్ విజయాలతో 12 ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న అద్భుతమైన రికార్డును చేజార్చుకున్న ఇండియా టీమ్ ఇప్పుడు మరో ప్రమాదం ముగింట నిలిచింది. గత 24 ఏండ్లుగా స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో టీమిండియా ఒక్కసారి కూడా వైట్‌వాష్ కాలేదు. ఇప్పుడు ఆ రికార్డును అలాగే కొనసాగించాలని రోహిత్‌సేన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగే ఆఖరిదైన మూడో టెస్టులో గెలుపే లక్ష్యంగా ఇండియా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టాప్ ప్లేస్‌ను కూడా కాపాడుకోవాలని భావిస్తోంది.
చివరిసారి 2000లో సౌతాఫ్రికాతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సచిన్ నేతృత్వంలోని టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. తొలి టెస్ట్‌లో 4 వికెట్ల తేడాతో, రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 71 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత సొంతగడ్డపై అలాంటి ఫలితాన్ని ఎదుర్కోలేదు. మరోవైపు 2020లో తమ దేశంలోజరిగిన సిరీస్‌లో చివరిసారి టీమిండియాను వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్.. మళ్లీ ఇప్పుడు ఇండియా గడ్డపై ఆ ఘనత సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. మరి, తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన రోహిత్‌సేన ముంబైలో ఏం చేస్తుందో చూడాలి.
రాణాకు చాన్స్!
సొంతగడ్డపై జట్టు వైట్‌వాష్ ప్రమాదం ముంగిట నేపథ్యంలో కెప్టెన్ రోహిత్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లోనైనా తమ స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోహ్లీ తన స్పిన్ బలహీనతను వీడి భారీ స్కోరు చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వీళ్లతో పాటు జట్టు సమష్టిగా రాణిస్తేనే కివీస్ జోరుకు అడ్డు వేయొచ్చు. డబ్ల్యూటీసీ నేపథ్యంలో పేసర్లకు రొటేషన్ పాలసీని అమలు చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తే బుమ్రా ప్లేస్‌లో యంగ్‌స్టర్ హర్షిత్ రాణా తుది జట్టులోకి రావొచ్చు. రెండో పేసర్‌గా ఆకాశ్‌దీప్, సిరాజ్‌లో ఒకరికి చాన్స్ దక్కొచ్చు.
వాంఖడే పిచ్ కూడా స్పిన్‌కు అనుకూలమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్, సుందర్‌ను కొనసాగనున్నారు. మరి టర్నింగ్ పిచ్ అయితే సుందర్ ప్లేస్‌లో కుల్దీప్ రావొచ్చు. ఇక బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో మన బ్యాటర్లు ఎక్కువగా స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టారు. ఆఫ్, లెగ్ స్టంప్ వెంట తెల్లని లైన్‌లు వేసి మరి ప్రాక్టీస్ చేశారు. దీనివల్ల బ్యాటర్లకు లైన్, లెంగ్త్‌పై అవగాహన వస్తుంది. తొలి టెస్ట్‌లో మన లైనప్ మొత్తం బౌన్స్‌కు తలొగ్గింది. పుణెలో శాంట్నర్ టర్నింగ్‌ను అర్థం చేసుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో ఈ రెండింటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గంభీర్ బృందం ఈ కొత్త ప్రణాళికను రూపొందించింది. ఈ ప్లాన్ వల్ల అనూహ్యంగా టర్న్ అయ్యే బాల్స్‌ను, బంతి ఎక్కడ అండర్ కట్ అవుతుందనే అంశాన్ని, ఓవర్ స్పిన్నింగ్ అయ్యే బాల్స్‌ను దీటుగా ఎదుర్కోవచ్చని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించాడు.
క్లీన్‌స్వీప్‌పై కివీస్ గురి..
ఊహించని రీతిలో 2–0తో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. దీనికోసం రెండో టెస్ట్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. వాంఖడే పిచ్ చివరి మూడు రోజులు స్పిన్నర్లకు అనుకూలించొచ్చు. దీంతో శాంట్నర్ నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉంది. ఎజాజ్, ఫిలిప్స్ కూడా ఇండియా లైనప్‌ను దెబ్బతీసేందుకు రెడీగా ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో లాథమ్ ఫామ్‌లో ఉన్నా కాన్వే, యంగ్, రచిన్ రవీంద్ర, మిచెల్ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాలి. మిడిల్‌లో బ్లండెల్, ఫిలిప్స్ రాణిస్తుండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం.
జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్, సర్ఫరాజ్, జడేజా, అశ్విన్, సుందర్/ కుల్దీప్, బుమ్రా / రాణా, సిరాజ్/ ఆకాశ్‌దీప్.
న్యూజిలాండ్ : లాథమ్ (కెప్టెన్), కాన్వే, యంగ్, రచిన్, డారిల్ మిచెల్, బ్లండెల్, ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ /ఒరూర్క్, హెన్రీ, ఎజాజ్.