స్టాక్ మార్కెట్ దెబ్బ.. నలుగురు టాప్ బిలియనీర్లకు రూ.85 వేల కోట్లు లాస్

స్టాక్ మార్కెట్ దెబ్బ.. నలుగురు టాప్ బిలియనీర్లకు రూ.85 వేల కోట్లు లాస్

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పతనం ఎఫెక్ట్​ మనదేశంలోని అత్యంత ధనవంతులపై భారీగానే పడింది. ఇండియాలోని నలుగురు టాప్​ బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ కుటుంబం, శివ్ నాడార్ కలిసి 10 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.85 వేల కోట్లు) పైగా నష్టపోయారు. వీరిలో భారతదేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్  కూడా అయిన ముఖేష్ అంబానీ అత్యధికంగా నష్టపోయారు. ఆయన సంపద 3.6 బిలియన్ డాలర్లు పడిపోవడంతో, మొత్తం నికర విలువ 87.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. 

అదానీ గ్రూప్‌‌‌‌ను నడుపుతున్న గౌతమ్ అదానీ సంపద మూడు బిలియన్ డాలర్లు పడిపోవడంతో నికర విలువ 57.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఓపీ జిందాల్ గ్రూప్ యజమానులు సావిత్రి జిందాల్, ఆమె కుటుంబం 2.2 బిలియన్ డాలర్లు నష్టపోయారు. వారి సంపద ఇప్పుడు 33.9 బిలియన్ డాలర్లు ఉంది. ఆమె ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో ఉన్నారు. హెచ్​సీఎల్​ టెక్నాలజీస్ ఫౌండర్​ శివ్ నాడార్ కూడా నష్టాల పాలయ్యారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లు తగ్గి 30.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

మాంద్యం భయాలతో నష్టాలు

ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరగడంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. టారిఫ్​వార్​ముదరడం, యునైటెడ్ స్టేట్స్‌‌‌‌లో మాంద్యం భయాల కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా పడిపోయింది.  నిఫ్టీ 22 వేల మార్కు దిగువకు పడిపోయింది.  ఈ విషయమై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ స్ట్రాటజిస్ట్  విజయకుమార్ మాట్లాడుతూ, "ట్రంప్ సుంకాల వల్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఇప్పుడు వేచి చూడటమే ఉత్తమం"  అని అన్నారు. 

అమెరికా ఎగుమతుల వాటా భారతదేశ జీడీపీలో కేవలం రెండుశాతం మాత్రమే కాబట్టి మనపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అన్నారు. భారతీయ వస్తువులపై సుంకాలు తగ్గించడంలో సహాయపడే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. ఇండియాతోపాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి సుంకాలు పెంచినప్పటి నుంచి వాల్ స్ట్రీట్ దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు నష్టపోయింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలోనే 5 ట్రిలియన్ డాలర్లు పడింది.