
న్యూఢిల్లీ: మనదేశం నుంచి ఎగుమతులు మార్చిలో 0.7 శాతం పెరిగి 41.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 6.62 శాతం పెరిగి 720.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీని వలన 282.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 14.05 బిలియన్ డాలర్లు ఉంది. గత ఏడాది మార్చిలో ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా 15.33 బిలియన్ డాలర్లు ఉంది. 2023–-24లో ఇది 241.14 బిలియన్ డాలర్లుగా రికార్డు అయింది. దిగుమతుల వృద్ధి నాలుగు నెలల గరిష్ట స్థాయి 11.3 శాతం పెరిగి మార్చిలో 63.51 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
మొత్తం వస్తువులు, సేవల ఎగుమతులు 2024-–25లో 820.93 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరుకుంటాయని అంచనా. 2023–-24లోఔట్‌బౌండ్ షిప్‌మెంట్ల విలువ 778.13 బిలియన్ డాలర్లుగా నమోదయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.