- మూడో టీ20లో ఇండియా విక్టరీ
- సౌతాఫ్రికాతో సిరీస్ 1–1తో డ్రా
- చెలరేగిన స్మృతి, పూజ, రాధా యాదవ్
చెన్నై : బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్ (4/13), రాధా యాదవ్ (3/6), బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (40 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 నాటౌట్) చెలరేగడంతో.. మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో ఇండియా విమెన్స్ టీమ్ 10 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో పంచుకుంది. టాస్ ఓడిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో 84 రన్స్‌కే కుప్పకూలింది. తజ్మిన్ బ్రిట్స్ (20) టాప్ స్కోరర్. మరిజేన్ కాప్ (10), అనెకా బోస్ (17) మినహా మిగతా వారు నిరాశపర్చారు.
తొలి నాలుగు ఓవర్లను నలుగురు భిన్నమైన బౌలర్లతో వేయించిన కెప్టెన్ హర్మన్.. సఫారీలను కట్టడి చేయడంలో బాగా సక్సెస్ అయ్యింది. పూజా, రాధా రెండు ఎండ్‌ల నుంచి ఒత్తిడి పెంచడంతో.. ఇన్నింగ్స్ మొత్తంలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అరుంధతి, శ్రేయాంక, దీప్తి తలా ఓ వికెట్ తీశారు. టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియా 10.5 ఓవర్లలోనే 88/0 స్కోరు చేసి నెగ్గింది. షెఫాలీ వర్మ (27 నాటౌట్), స్మృతి బౌండ్రీలు, సిక్సర్లతో హోరెత్తించారు. పూజకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించాయి.