మంచిర్యాల/లక్షెట్టిపేట, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనతోనే ఇండియాకు ముందెన్నడూ లేనంతగా ప్రపంచ ఖ్యాతి వచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమైనప్పటికీ ఇండియా గ్రోత్ రేటుతో ముందుకు సాగిందంటే మోదీ సంస్కరణల ఘనతేనని చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలో వివేక్ పర్యటించారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ టిఫిన్ బైటక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మంచిర్యాలలోని పార్టీ జిల్లా ఆఫీసులో కాసిపేట మండలానికి చెందిన యువకులు బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చేనాటికి ఇండియా ఎకానమీ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందన్నారు. మోదీ తొమ్మిదేండ్ల పాలనలో 5వ స్థానానికి చేరిందని చెప్పారు. రానున్న రోజుల్లో 3వ స్థానంలో నిలపడమే లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టింది. ప్రస్తుత బీఆర్ఎస్ సర్కారు కూడా నా కంపెనీలను మూసివేయించింది. వీ6 మీడియాపై ఆంక్షలు విధించినప్పటికీ నేను భయపడకుండా పోరాటం కొనసాగిస్తున్నాను” అని వివేక్ అన్నారు.
రానున్న ఎన్నికల్లో అవినీతి, నియంతృత్వ బీఆర్ఎస్ను గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లీడర్లు బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి భయపెడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరి బెదిరింపులకూ భయపడవద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, రజనీశ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.