
- నిఖత్ జరీన్, లవ్లీనాపై భారీ అంచనాలు
- మరో 4 రోజుల్లో మెగా గేమ్స్
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో తొమ్మిది వెయిట్ కేటగిరీల్లో ఇండియా బాక్సర్లు ఈసారి ఆరుకు పరిమితమయ్యారు. మెన్స్‌లో అమిత్ పంగల్ (51 కేజీ), నిశాంత్ దేవ్ (71 కేజీ), విమెన్స్‌లో నిఖత్ జరీన్ (50 కేజీ), లవ్లీనా బోర్గోహెన్ (75 కేజీ), ప్రీతి పవార్ (54 కేజీ), జైస్మిన్ లాంబోరియా (57 కేజీ) అర్హత సాధించారు. ఇందులో నిజామాబాద్ స్టార్ బాక్సర్ నిఖత్ తొలిసారి మెగా గేమ్స్‌లో పోటీపడుతోంది. 2022, 2023లో వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్ గెలవడంతో నిఖత్‌పై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ నెగ్గిన నిఖత్.. గతేడాది ఆసియా గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్‌ను సాధించింది.
ఈ ఏడాది స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో సిల్వర్ నెగ్గిన ఆమె ఎలోర్డా కప్‌లో గోల్డ్‌ను సాధించింది. బాక్సింగ్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న నిఖత్‌కు రింగ్‌లో ఎంత పెద్ద ప్రత్యర్థి ఉన్నా తనదైన రోజున ఏకపక్ష విజయాలు సాధించడం అలవాటుగా మారింది. ఇక టెక్నికల్ గేమ్ ఆడటంలో ఈ తెలంగాణ బాక్సర్ దిట్ట. హుక్స్, అప్పర్ కట్స్‌తో పాటు సాంప్రదాయబద్దమైన లోయర్ పంచ్‌లు కొట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఒకప్పుడు లెజెండ్ మేరీ కోమ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నా.. పోరాట స్ఫూర్తి, అంకితభావం, తెగువతో ఇండియన్ బాక్సింగ్‌లో తనకంటూ ఓ పేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ఈసారి గేమ్స్‌లో నిఖత్‌కు యూరోపియన్ చాంప్ బస్ నాజ్ కాకిరోగ్లు, గియోర్డానా సోరెంటినో, ఇంగ్రిట్ వాలెన్సియా, యాస్మిన్ మౌతాకీ, వు యు, చుతామత్ రక్షత్, నాజిమ్ కైజేబే నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
ప్రీతి కల నెరవేరేనా?
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన పంచ్ పవర్ చూపెట్టిన ప్రీతి పవార్ (54 కేజీ) తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆసియా గేమ్స్, ఆసియా అండర్–22 చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్స్ నెగ్గిన ఆమెకు బాక్సింగ్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్లలో ఎక్కువగా ఆడకపోవడం ఆమె బలహీనతగా చెప్పొచ్చు. యూరోపియన్ గేమ్స్ చాంప్ స్టానిమిరా పెట్రోవా, మాజీ వరల్డ్ చాంపియన్ హటీస్ అక్బాస్, ఆసియా గేమ్స్ చాంపియన్ పాంగ్ చోల్‌మి, ఒలింపిక్ బ్రాంజ్ విన్నర్ హువాంగ్ హివావోవెన్, యెనీ అరియాస్, జుటామస్ జిట్‌పాంగ్ నుంచి పోటీ తప్పదు.
జైస్మిన్ ఎందాకా?
ఆసియా గేమ్స్‌లో నిరాశపర్చిన జైస్మిన్ లాంబోరియా (57 కేజీ).. కామన్వెల్త్ గేమ్స్ బ్రాంజ్ మెడల్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. తన వెయిట్ కేటగిరీ 60 కేజీల్లో పెద్దగా రాణించలేకపోయింది. అయితే వరల్డ్ క్వాలిఫయర్స్‌లో పర్వీన్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో జైస్మిన్‌కు మళ్లీ ఒలింపిక్స్ ఆడే చాన్స్ వచ్చింది. తన వెయిట్ కేటగిరీని మార్చుకుని 57 కేజీల్లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతానికి ఈ కేటగిరీ జైస్మిన్‌కు సరిపోయింది. కాకపోతే మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం చాలా ఉంది. వరల్డ్ చాంపియన్ ఇర్మా టెస్టా, కామన్వెల్త్ చాంప్ మైకేల్ వాల్ష్, యూరోపియన్ గేమ్స్ విన్నర్ అమీనా జిదానీ, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లిన్ యుటింగ్, కరీనా ఇబ్రగిమోవా, నెస్తీ పెటేసియాను నిలువరిస్తే మెడల్‌ను ఆశించొచ్చు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న నిశాంత్, అమిత్ పంగల్ కూడా మెడల్స్‌పై దృష్టి పెట్టారు.
మెడల్ రిపీట్ చేస్తుందా?
టోక్యోలో బ్రాంజ్ సాధించిన లవ్లీనా పారిస్‌లోనూ మెడల్‌ను రిపీట్ చేస్తుందా చూడాలి. ఈ గేమ్స్ కోసం 69 కేజీల నుంచి 75కు మారిన ఆమె మంచి పెర్ఫామెన్స్ చూపెడుతోంది. గతేడాది ఆసియా గేమ్స్‌లో సిల్వర్‌తో పాటు ఈ ఏడాది గ్రాండ్‌ప్రి ఈవెంట్‌లో బ్రాంజ్ నెగ్గింది. దీంతో ఈసారి కూడా మెడల్ గెలుస్తుందనే నమ్మకం పెరిగింది. అయితే ఈ కేటగిరీలోనూ లవ్లీనాకు బలమైన ప్రత్యర్థులే ఎదురయ్యారు. వరల్డ్ బ్రాంజ్ మెడలిస్ట్ డావినా మిచెల్, యూరోపియన్ గేమ్స్ చాంప్ ఐఓఫీ ఓ రూర్కీ, వరల్డ్ చాంపియన్ ఖదీజా అల్ మార్డి, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లీ క్వియాన్, కామన్వెల్త్ చాంపియన్ తమారా తిబుల్ట్, ఏథైనా బైలాన్ బరిలో ఉన్నారు. కాబట్టి ఏ మాత్రం పట్టు విడిచినా పతకం కష్టం.