- ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ ప్లేయర్
- అతి పిన్న వయస్కుడిగానూ సరికొత్త రికార్డు
- టైటిల్ ఫైట్‌లో డింగ్ లిరెన్‌పై అద్భుత విజయం
సింగపూర్ : ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.. వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా, 6.5 పాయింట్లు)తో గురువారం ముగిసిన ఆఖరిదైన 14వ రౌండ్‌లో అద్భుత విజయం సాధించిన గుకేశ్ ఏడున్నర పాయింట్లు సాధించి18వ చాంపియన్‌గా నిలిచాడు. దీంతో అతి పిన్న వయసు (18 ఏళ్లు)లో ఈ టైటిల్‌ను గెలిచిన తొలి గ్రాండ్ మాస్టర్‌గా రికార్డు సృష్టించాడు. తద్వారా రష్యా లెజెండ్ ప్లేయర్ గ్యారీ కాస్పరోవ్ (22 ఏళ్లు) రికార్డును బ్రేక్ చేశాడు. 1985లో కాస్పరోవ్.. అంటోలి కార్పోవ్‌పై నెగ్గాడు.
ఇక ఇండియా గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ (5 సార్లు) తర్వాత చాంపియన్‌గా నిలిచిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా గుకేశ్ రికార్డులకెక్కాడు. 2012 తర్వాత వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ప్లేయర్ గుకేశ్ కావడం విశేషం. విన్నర్‌గా నిలిచిన గుకేశ్‌కు రూ. 11.03 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది.
58 ఎత్తులతో..
తమిళనాడులో స్థిరపడిన తెలుగు మూలాలు కలిగిన గుకేశ్.. ఈ టోర్నీలో మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గానే ఉన్నాడు. కాకపోతే టోర్నీ ఆరంభంలో వరుసగా డ్రాలు చేసుకున్నా.. ఎక్కడా తన ఆటలో, మార్పు రాకుండా జాగ్రత్తపడ్డాడు. లిరెన్ కూడా చాన్స్ వచ్చిన ప్రతిసారి గుకేశ్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో 13వ గేమ్ కూడా డ్రాగానే ముగిసింది. ఈ గేమ్‌లో గుకేశ్ తెల్లపావులతో ఆడటంతో కచ్చితంగా గెలుస్తాడని ఆశించారు. కానీ లిరెన్ 68 ఎత్తుల వద్ద డ్రా చేయడంతో టైటిల్ ఫైట్‌లో ఉత్కంఠ ఓ రేంజ్‌కు చేరింది.
ఫైనల్ పోరు కూడా అనూహ్యంగా డ్రా వైపుగానే సాగింది. కానీ క్షణ కాలం ఏకాగ్రత కోల్పోయి లిరెన్ చేసిన ఓ చిన్న తప్పిదాన్ని ఆసరాగా చేసుకున్న గుకేశ్ 55వ ఎత్తు వద్ద గేమ్‌ను ఊహించని మలుపు తిప్పాడు. లిరెన్ బోర్డుపై రెండు బంటులు మాత్రమే మిగిలి ఉంటే... గుకేశ్ రూక్, బిషప్‌తో ముందుకెళ్లాడు. చకచకా వ్యూహం మారుస్తూ చివరకు 58 ఎత్తుల వద్ద లిరెన్‌పై పైచేయి సాధించాడు. అంతే ఊహించని విజయం సాధించిన గుకేశ్ కన్నీటి పర్యంతం కాగా, లిరెన్ ముభావంతో కూర్చుండిపోయాడు.
అద్భుత విజయం సాధించిన గుకేశ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. లక్షలాది మంది యువతకు గుకేశ్ స్ఫూర్తిగా నిలిచాడని మోదీ కితాబిచ్చారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అభినవ్ బింద్రా, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, అమెరికన్ గ్రాండ్ మాస్టర్ హికరు నకమురా, విశ్వనాథన్ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్షణం కోసం గత పదేళ్లుగా కల కంటున్నా. ఇప్పుడు నా కల సాకారమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గెలుస్తానని ఊహించలేదు. గెలిచిన వెంటనే కాస్త ఉద్వేగానికి లోనయ్యా. ఆరు, ఏడేళ్ల వయసు నుంచి ఇలాంటి కలల కోసం చాలా ఎదురుచూశా. అందుకే ప్రతి ప్లేయర్ ఈ క్షణం కోసమే జీవిస్తారు. నేను కూడా ఈ క్షణాల కోసమే జీవించాలని కోరుకున్నా. చాంపియన్‌షిప్‌లో పోటీపడిన ప్లేయర్ల నుంచి దేవుడి వరకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా.
డింగ్ నిజమైన చాంపియన్. ప్రతి రౌండ్‌లో చాలా గట్టిగా పోరాడాడు. విజయం అతన్ని వరించనందుకు సారీ చెప్పాలనుకుంటున్నా. నేను చెస్ చాంపియన్‌షిప్‌ను గెలవాలని నా కంటే నా తల్లిదండ్రులే ఎక్కువగా కోరుకున్నారు. ఇప్పుడు ఆ కల నిజమైనందుకు చాలా గర్వంగా ఉంది.– గుకేశ్
గేమ్‌లో నేను తప్పు చేశానని గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఈ ఏడాదిలోనే నేను అత్యుత్తమ టోర్నీ ఆడానని మాత్రం చెప్పగలను. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తా. నేను ఓడిపోవడంపై ఎటువంటి పశ్చాత్తాపం లేదు. – లిరెన్