
పారిస్ : ఇండియా యంగ్ షట్లర్ లక్ష్యసేన్.. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లోకి ప్రవేశించాడు. మెన్స్ సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. గతంలో కశ్యప్, శ్రీకాంత్ క్వార్టర్స్ వరకు వచ్చారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్య 19–21, 21–15, 21–12తో చో తియాన్ చెన్ (చైనీస్‌తైపీ)పై గెలిచాడు. 75 నిమిషాల మ్యాచ్‌లో లక్ష్య తొలి గేమ్ చేజార్చుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో క్రమంగా పుంజుకున్నాడు. ప్రత్యర్థి బలహీనతలను ఆసరాగా చేసుకుని బేస్‌లైన్ షాట్లతో రెచ్చిపోయాడు.
అయితే రెండో గేమ్ మధ్యలో తియాన్ పుంజుకోవడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరకు రెండు బలమైన స్మాష్‌లతో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇండియన్ ప్లేయర్ పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. నెట్ డ్రాప్స్‌తో పాటు క్రాస్ కోర్టు ర్యాలీస్‌లు ఆడుతూ చకచకా పాయింట్లు నెగ్గాడు. దీంతో బ్రేక్ వరకే స్పష్టమైన లీడ్‌లో నిలిచాడు. అదే జోరును చివరి వరకు కొనసాగించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.