- భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో యువశక్తే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగకుండా భారత్‌ను ఏ శక్తీ ఆపలేదన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో మోదీ పాల్గొని, ప్రసంగించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం కష్టమని కొంతమంది అనిపించవచ్చు కానీ అసాధ్యమైతే కాదని పేర్కొన్నారు.
దేశం ముందుకు సాగాలంటే పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, నేడు భారత్ అదే చేస్తున్నదని తెలిపారు. వివిధ రంగాల్లో అనేక లక్ష్యాలను పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. 2030 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్బ్లెండింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని, దీన్ని అంతకంటే ముందే చేరుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఒక్కటే దేశాన్ని ముందుకు నడపలేదని, వికసిత్ భారత్యజమానిని తానొక్కడినే కాదని, ఇందులో యువతతోపాటు అందరూ భాగస్వాములేనని అన్నారు.
అమెరికా, సింగపూర్‌లా ఎదగాలి
భారీ లక్ష్యాలు పెట్టుకొని, నిజాయితీగా పనిచేస్తే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందని మోదీ తెలిపారు. 1930లో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా, కనీస మౌలిక వసతులు కూడా లేని స్థాయినుంచి సింగపూర్ బలమైన ఆర్థిక వ్యవస్థలుగాఎదిగిన తీరును మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
భారత్ ఇప్పుడు వ్యవసాయ సంక్షోభాలను అధిగమించిందని, బహిరంగ మల విసర్జనను నిర్మూలన, ఇంటింటికీ ఎల్పీజీ సిలిండర్లు.. ఇవి దేశం సాధించిన చారిత్రక విజయాలని వివరించారు. కొవిడ్ సమయంలో టీకాల అభివృద్ధి సహా ప్రపంచ నాయకత్వాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నదని మోదీ చెప్పారు.
నేడు కాశ్మీర్లో జడ్–మోర్హ్ టన్నెల్ ప్రారంభం
జమ్మూ కాశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో నిర్మించిన జెడ్–మోర్హ్ టన్నెల్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ ఫోర్సెస్.. కాశ్మీర్లో శానిటైజేషన్‌తోపాటు భద్రతా ఏర్పాట్లు చేశాయి. వివిధ జిల్లాల్లోని కూడళ్లల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించినట్టు అధికారులు తెలిపారు.