అంబానీ, అదానీల ర్యాంకులు తగ్గినయ్​!

అంబానీ, అదానీల ర్యాంకులు తగ్గినయ్​!
  • 100 బిలియన్ ​డాలర్ల  క్లబ్​ నుంచి బయటికి 
  • వ్యాపారాల్లో ఇబ్బందులే కారణం

న్యూఢిల్లీ: వ్యాపారాల్లో సమస్యల కారణంగా సంపద తగ్గడంతో రిలయన్స్ సీఎండీ ముఖేష్ అంబానీ,  అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్  బ్లూమ్​బర్గ్​ 100 బిలియన్​డాలర్ల క్లబ్​నుంచి బయటికి వచ్చారు. వీళ్లిద్దరూ   ఆసియాలో  అత్యంత సంపన్న వ్యక్తులే కాదు..  భారతదేశంలోని అత్యంత సంపన్న బిలియనీర్లు కూడా! వ్యాపారాల్లో పలు ఇబ్బందులు రావడం వల్ల బ్లూమ్‌‌బెర్గ్  100 బిలియన్ డాలర్ల క్లబ్‌‌లో ఈ సంవత్సరానికి చోటు దక్కించుకోలేకపోయారని వెబ్‌‌సైట్ వెల్లడించింది.  అయినప్పటికీ అంబానీ వ్యక్తిగత నెట్​వర్త్​ మాత్రంపెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి  టాప్ –20 సంపన్నులు 67.3 బిలియన్ డాలర్ల మేర లాభపడ్డారు. ఐటీ పారిశ్రామికవేత్త శివ్ నాడార్ (10.8 బిలియన్ డాలర్ల)  సావిత్రి జిందాల్ (10.1 బిలియన్ డాలర్ల) అత్యధిక లాభాలను ఆర్జించారు. కంపెనీ రిటైల్,  ఇంధన విభాగాల పనితీరు బాగాలేకపోవడంతో అంబానీ  సంపద దెబ్బతింది. కొడుకు అనంత్ పెళ్లి చేసుకున్న జులైలో ఆయన సంపద 120.8 బిలియన్ డాలర్లు కాగా, డిసెంబర్ 13 నాటికి 96.7 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (బీబీఐ) పేర్కొంది.

అదానీకీ భారీగానే సమస్యలు

అదానీ సమస్యల లిస్టు పెద్దదే! యూఎస్​ డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) దర్యాప్తు ఆయన గ్రూపునకు ఇబ్బందిగా మారింది. సోలార్​ ప్రాజెక్టుల కోసం అదానీతోపాటు మరికొందరు లంచాలు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది నవంబర్‌‌లో జరిగిన ఈ కేసు విచారణ ఫలితంగా అదానీ నికర విలువ జూన్‌‌లో 122.3 బిలియన్ డాలర్ల నుంచి 82.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. హిండెన్‌‌బర్గ్ రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపణలతోనూ అదానీ తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆయన కంపెనీల షేర్లు విపరీతంగా దెబ్బతిన్నాయి. బ్లూమ్‌‌బెర్గ్ ప్రకారం అదానీ, అంబానీ ఇకపై "ఎలైట్ సెంటీబిలియనీర్స్ క్లబ్"లో సభ్యులు కారు. వంద బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారి పేర్లను ఈ లిస్టులో చేర్చుతారు.  ఎలాన్ మస్క్  స్టార్‌‌లింక్ భారత శాటిలైట్ బ్రాడ్‌‌బ్యాండ్ మార్కెట్‌‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే జియో సహా భారతదేశ టెలికాం కంపెనీలకు ప్రమాదకరంగా పరిణమించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఏడాది 432.4 బిలియన్ డాలర్ల నికర విలువతో  వాల్‌‌మార్ట్ వాల్టన్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచారు.