- కండ్లకు జీవం పోసిన శిల్పి రాజేంద్రన్
- శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి తుది మెరుగులు
- ఏడున సీఎం తొలిపూజతో దర్శనానికి అనుమతి
పంజాగుట్ట, వెలుగు : నవరాత్రులకు ఖైరతాబాద్మహా గణపతి ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. శిల్పి రాజేంద్రన్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నాడు. గురువారం గణపతి కనుపాపలను గీసి జీవం పోశారు. మరో రెండు రోజుల్లోనే నవరాత్రులు ప్రారంభం కానుండడంతో శరవేగంతో పనులు పూర్తి చేస్తున్నారు. ఏడో తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేసే తొలిపూజ తర్వాత ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు.
అడుగు ఎత్తు నుంచి 70 అడుగుల వరకు..
1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్‌లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి 70 ఏండ్లు పూర్తి కావడంతో 70 అడుగుల గణపతిని తీర్చిదిద్దారు. మొదట్లో ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసినా..పర్యావరణ హితం కోసం రెండేండ్లుగా మహా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకు 1000 బ్యాగుల మట్టి,18 టన్నుల ఇనుము, 2వేల మీటర్ల కాటన్క్లాత్, మరో 2వేల మీటర్ల జూట్క్లాత్, 3 పెద్ద ట్రాలీల ఇసుక, వరి గడ్డి ఒక్కో బండిల్ 50 కిలోల చొప్పున 60 బండిల్స్ఉపయోగించారు. విగ్రహానికి రంగుల కోసం పూర్తిగా వాటర్ కలర్సే వాడారు.
Also Read :- హైదరాబాద్ లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ
ఏడు ముఖాల్లో.. విగ్రహం
విగ్రహానికి 7 ముఖాలు ఏర్పాటు చేయగా, ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు. కుడివైపు చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలుండగా ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డూ ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు.
148 మంది భాగస్వామ్యం
నిర్జల ఏకాదశి నాడు పనులు మొదలవ్వగా 78 రోజుల్లో గణనాథుడు సిద్ధమయ్యాడు. షెడ్డు పని అదిలాబాద్‌కు చెందిన నర్సయ్య ఆధ్వర్యంలో 25 మంది చేశారు. , వెల్డింగ్పనులను మచిలీపట్నానికి చెందిన నాగబాబుతో కలిసి 23 మంది, గణపతి ఔట్లైన్పనులను చెన్నైకు చెందిన మూర్తి 25 మందితో, రాహు కేతువు, బాల రాముడు ఇతర పనులకు ఒడిశాకు చెందిన జోగారావు 20 మంది కళాకారులతో కలిసి చేశారు. 55 మంది గణపతికి రంగులు అద్దారు.