- జీడీపీలో 9 శాతానికి తగ్గుతుందన్న గడ్కరీ
న్యూఢిల్లీ : తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నందున వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14 శాతంగా ఉందని, యూరప్, యూఎస్‌లో లాజిస్టిక్స్ ధర దాదాపు 12 శాతం ఉందని చెప్పారు. చైనాలో లాజిస్టిక్స్ ధర దాదాపు 8 శాతం ఉందని ఆయన వివరించారు.
మనదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు 2021-–22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 7.8 శాతం నుంచి 8.9 శాతం మధ్య ఉన్నాయి. అయితే 2022–-23లో ఇది జీడీపీలో 14–-18 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటు దాదాపు 8 శాతం కంటే చాలా ఎక్కువ. ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీ అవకాశాలున్నాయని గడ్కరీ అన్నారు. మిథనాల్ తయారీకి నాణ్యత లేని బొగ్గు కూడా ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు.