
బుడాపెస్ట్ : చెస్ ఒలింపియాడ్‌లో ఇండియా మెన్స్ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన పదో రౌండ్‌లో ఇండియా 2.5–1.5తో అమెరికాకు చెక్ పెట్టింది. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ 60 ఎత్తుల వద్ద పెరెజ్ లీనియర్‌పై గెలవడంతో మ్యాచ్ ఇండియా సొంతమైంది. గుకేశ్ 46 ఎత్తులతో కరువాన ఫ్యాబియానోపై గెలవగా, ప్రజ్ఞానంద 41 ఎత్తుల వద్ద సో వెస్లీ చేతిలో ఓడాడు. విదిత్ సంతోష్ గుజరాతీ.. ఆరోనియన్ లెవాన్ మధ్య జరిగిన గేమ్ 63 ఎత్తుల వద్ద డ్రా కావడంతో స్కోరు 1.5–1.5గా మారింది.
ఈ దశలో అర్జున్ విజయం సాధించి ఇండియాను గెలిపించాడు. విమెన్స్ సెక్షన్‌లో కూడా ఇండియా 2.5 –1.5 తేడాతో చైనాను ఓడించింది. తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. జు జినెర్ మధ్య జరిగిన గేమ్ 33 ఎత్తుల వద్ద డ్రా కాగా, ని షిక్విన్‌తో జరిగిన గేమ్‌ను దివ్య దేశ్‌ముఖ్ 39 ఎత్తుల వద్ద గెలిచింది. వంతిక అగర్వాల్.. లూ మయోయి, వైశాలి.. గువో క్వి మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి.