భారత మాజీ క్రికెటర్ దత్తా గైక్వాడ్ కన్నుమూశారు. ఫిబ్రవరి 13 మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన గైక్వాడ్ .. 1952, 1959లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టీండీస్ పర్యటనలకు వెళ్లిన జట్లలో సభ్యుడిగా ఉన్నారు. 1959లో భారత జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 52 పరుగులే గైక్వాడ్ టెస్ట్ కెరీర్ లో సాధించిన ఏకైక అర్థసెంచరీ.
దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3 వేల 139 పరుగులు సాధించాడు. రంజీలో అతని అత్యధిక స్కోరు 249 పరుగులు. 1959-60లో మహారాష్ట్రపై సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన అంశుమన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడే. 1928, అక్టోబర్ 27న గుజరాత్ లోని వదోదరలో జన్మించారు దత్తా గైక్వాడ్ . గైక్వాడ్ తన 95వ పుట్టినరోజును అక్టోబర్ 27, 2023న జరుపుకున్నారు.