దిగొచ్చిన ద్రవ్యోల్బణం..ఐదేళ్లలో కనిష్టానికి పతనం

దిగొచ్చిన ద్రవ్యోల్బణం..ఐదేళ్లలో కనిష్టానికి పతనం
  • జులైలో 3.5 శాతంగా నమోదు
  • ఆర్​బీఐ లిమిట్‌‌లోపు ఇన్‌‌ఫ్లేషన్‌‌

న్యూఢిల్లీ : మనదేశ రిటైల్ ద్రవ్యోల్బణం (ఇన్‌‌ఫ్లేషన్‌‌) జులైలో వార్షిక ప్రాతిపదికన 3.54 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం రేటు ఆగస్టు 2019 తర్వాత మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా ఉంది. జూన్‌‌‌‌లో ఇది ఆహార ధరల పెరుగుదల కారణంగా వార్షిక ప్రాతిపదికన 5.08 శాతానికి ఎగిసింది. జులై 2023లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.44 శాతంగా ఉంది. ఇది ఆ సమయంలో 15 నెలల గరిష్టం. అయితే, 36 మంది ఆర్థికవేత్తలతో కూడిన రాయిటర్స్ పోల్ ఈ సంఖ్య గణనీయంగా 3.65 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.

ప్రధాన ద్రవ్యోల్బణం ఆర్​బీఐ 2-–6 శాతం పరిధిలోనే ఉంది. అయితే, 4 శాతం లక్ష్యం స్థిరంగా లేకపోవడం వల్ల ఈ ఏడాది ఆర్‌‌‌‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించే ప్రణాళికలకు అడ్డంకి అవుతుంది. గ్రామీణ ద్రవ్యోల్బణం జూన్‌‌‌‌లో 5.66 శాతం,  జులై 2023లో 7.63 శాతం నుంచి జులైలో 4.10 శాతానికి తగ్గింది. పట్టణ ద్రవ్యోల్బణం కూడా జూన్‌‌‌‌లో 4.39 శాతం నుంచి జులైలో 2.98 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో పట్టణ ద్రవ్యోల్బణం 7.2 శాతానికి పెరిగింది. 

ఆహార ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం లెక్కల్లో 50 శాతానికి సమానంగా ఉండే ఆహార ద్రవ్యోల్బణం  ఈ ఏడాది జులైలో 5.42 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జూన్‌‌‌‌లో ఇది 9.36 శాతం,  జులై 2023లో 11.51 శాతంగా నమోదయింది. జూన్‌‌‌‌లో 29.32 శాతంగా ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం జులైలో 6.83 శాతానికి చేరుకుంది. మనదేశ ప్రధాన ఆహారంలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్న తృణధాన్యాలు,  పప్పుధాన్యాల ధరలు వరుసగా 8.14 శాతం,  14.77 శాతం పెరిగాయి.జులైలో 5.48 శాతానికి తగ్గిన ఇంధనం, కరెంటు ధరలు జూన్​లో 3.66 శాతం ఉన్నాయి.  ఇటీవల ముగిసిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్​బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను

4.5 శాతానికి మార్చలేదు. 6.5 శాతం వద్ద రేట్లను యథాతథంగా ఉంచింది.  ఇదిలా ఉంటే,    విద్యుత్,  మైనింగ్ రంగాలు మంచి పనితీరును బాగున్నప్పటికీ, తయారీ రంగం  పేలవమైన పనితీరు కారణంగా, భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి జూన్ 2024లో ఐదు నెలల కనిష్ట స్థాయి 4.2 శాతానికి తగ్గింది.   పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)గా పిలిచే ఫ్యాక్టరీ ఉత్పత్తి వృద్ధి మేలో 6.2 శాతం, ఏప్రిల్‌‌‌‌లో 5 శాతం, మార్చిలో 5.5 శాతం, ఫిబ్రవరిలో 5.6 శాతం,  2024 జనవరిలో 4.2 శాతం నమోదయింది.