
- గణతంత్ర వేడుకల్లో 5వేల మందితో ఒకే సారి నృత్యం
- తిర్యాణి మండలం దంతన్ పల్లి గ్రామానికి చెందిన 15 మందికి చోటు
- ఆసిఫాబాద్‌లో సంబరాలు చేసుకున్న కళాకారులు
ఆసిఫాబాద్, వెలుగు: ‘జయతీ జయ జయ మమ భారతం’ అంటూ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 5 వేల మంది కళాకారులు చేసిన సామూహిక గస్సాడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఈ పాటకు చేసిన నృత్యంలో 5 వేల మందిలో 2,800 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో తెలంగాణాకు చెందిన 100 మంది పాల్గొనగా.. ఆసిఫాబాద్ జిల్లా నుంచి 65 మందికి చోటు దక్కింది. అత్యంత మారుమూల ప్రాంతమైన తిర్యాణి మండలం దంతన్ పల్లికి చెందిన 15 మంది ఆదిమ గిరిజన యువ కళాకారులు ఉండడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగివచ్చిన ఈ కళాకారులు బృందం కొత్త అనుభూతి చెందుతున్నారు. కేంద్ర సాంసృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి తమను గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతరిస్తున్న కళను కాపాడుతున్న యువతరం..
గుస్సాడీ కళ అంతరించే దశకు చేరుకుంది. దీన్ని కాపాడేందుకు ఆదిమ గిరిజనులు కృషి చేస్తున్నారు. దంతన్‌పల్లి గ్రామానికి చెందిన 15 మంది బృందంలో టీమ్ లీడర్ ఆత్రం గంగారాం సహా మిగిలిన అందరూ 25 యేండ్ల లోపు వారే కావడం గమనార్హం. వీళ్లంతా ఇంటర్, డిగ్రీ చదువుకుంటున్నారు. చదువుతో పాటు తమ సంస్కృతి సంప్రదాయాలకు విలువ ఇవ్వడం పట్ల అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన కళాకారులు మంగళవారం మండలం దంతన్ పల్లి భీమయ్యక్ పీవీటీజీ కొలాం గుస్సాడి బృందం సభ్యులతో పాటు ,గ్రామస్తులు, విద్యార్థులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించి, కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాకారులను గ్రామస్తులు, నాయకులు సన్మానించారు. వీళ్లంతా స్థానిక పీవీటీజీ పూర్వ విద్యార్థులు కావడంతో అక్కడి విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. వీరితో పాటు జైనూర్, సిర్పూర్(యు) మండలాల ఆదివాసీ కళాకారులు సైతం ఢిల్లీ వేడుకల్లో పాల్గొని తమ ప్రతిభ చాటడంతో ఆయా మండలాల్లో హర్షం వ్యక్తమవుతోంది.