ఇందిరాగాంధీ విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు

  • జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: దేశ తొలి మహిళా ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు నివాళులర్పించారు. మంగళవారం ఇందిరాగాంధీ జయంతిని  పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా ప్రజలందరికీ పత్రిక ప్రకటనలో సీఎం శుభాకాంక్షలు తెలిపారు. నెహ్రూ నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళ ఇందిరా గాంధీ దేశప్రజలకు మేలు చేసే ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని సీఎం కొనియాడారు. 

పేదలు, మహిళల అభ్యున్నతికి ఇందిరమ్మ విశేష కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. 'భారతీయ శక్తికి మహిళలే ప్రతీకలు' అన్న ఇందిరా గాంధీ  మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాల్లో ఒకటని ఆయన తెలిపారు. 

ఇందిరమ్మ జయంతి రోజునే 22 జిల్లాల్లో నూతనంగా నిర్మించబోయే ఇందిర మహిళా శక్తి భవనాలకు భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడం గర్వకారణమని చెప్పారు. దేశ చరిత్రలో తొలిసారిగా 4 వేల మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ప్రజాప్రభుత్వం ఘనతేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.