ఉక్కు మహిళ ఇందిరాగాంధీ..

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ..

భారతదేశపు  కీర్తిని  ప్రపంచం  నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ  ఇందిరాగాంధీ.  ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని  శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.  ఇందిరాగాంధీ  దేశానికి అందించిన  నిరుపమాన సేవలు  నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకం.  ఇందిరాగాంధీ 1917 నవంబర్​ 19న  అలహాబాద్​లోని ఆనంద్​భవన్​లో  భారత దేశపు  తొలి ప్రధాని  జవహర్​లాల్​ నెహ్రూ,  కమలా నెహ్రూ దంపతులకు  జన్మించారు.  ఆమె అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని.  కాగా,  లండన్​లోని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో పాత్రికేయుడు ఫిరోజ్​తో  స్నేహం..  ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.  

వీరిద్దరి కుల, మతాలు వేరైనా గాంధీజీ ఆశీస్సులతో 1942లో  ఇందిర, ఫిరోజ్ల వివాహం జరిగింది. 1964లో  ఆమె తండ్రి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్​లాల్​ నెహ్రూ మరణం అనంతరం ఇందిరా గాంధీ  రాజ్యసభకు ఎన్నికైంది. లాల్ బహదూర్​ శాస్త్రి మంత్రిమండలిలో  ప్రసారశాఖ మంత్రిగా ఆమె విశిష్ట సేవలు అందించింది. ఈక్రమంలో 1966లో  మొదటిసారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించి.. దేశ మొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించింది. కాగా, నేటి వరకు మరో మహిళ భారతదేశ  ప్రధాని పదవిని అధిష్టించకపోవడం గమనార్హం.  ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.  బ్యాంకుల  జాతీయకరణ,  జమీందారీ వ్యవస్థ రద్దు,  గరీబీ  హఠావో వంటి గొప్ప పథకాలతో  భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారు. 

సమగ్ర దేశాభివృద్ధికి మార్గదర్శి

'ఆపరేషన్ బ్లూ స్టార్'లో  భాగంగా  గోల్డెన్ టెంపుల్ వద్ద సైనిక చర్య తర్వాత 1984 అక్టోబర్ 31న తన ఇద్దరు అంగరక్షకుల చేతిలో  హత్యకు గురయ్యారు. ఆమె అంగరక్షకులలో ఒకరైన బియాంత్ సింగ్  తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం మరో అంగరక్షకుడు సత్వంత్ సింగ్ తన తుపాకీతో ఇందిరాగాంధీపై కాల్పులు జరపడంతో ఆమె నేలకొరిగారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.  కాగా, ఇందిరాగాంధీ మరణం దేశానికి గొప్ప విషాదాన్ని, తీరని లోటును మిగిల్చింది.  ఆమె దేశభక్తి,  ధైర్య సాహసాలు, దేశాభివృద్ధికి ఆమె చూపిన మార్గం దేశ ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది.  ఇందిరా గాంధీ  భారతదేశ ఏకైక మహిళా ప్రధానమంత్రిగానే కాకుండా,  ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిచ్చే నాయకురాలిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.  ప్రతి మహిళకు ఆమె చూపిన ధైర్యం, అంకితభావం నేటికీ స్ఫూర్తినిస్తోంది.   భారతదేశ సమగ్ర అభివృద్ధికి తీసుకున్న కీలకమైన నిర్ణయాలు, సేవలను ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా  మననం చేసుకుని ఉక్కు మహిళకు  ఘనంగా నివాళి అర్పిద్దాం. 

దేశ ప్రధానిగా విప్లవాత్మక నిర్ణయాలు

ఇందిరాగాంధీ జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు,  మళ్లీ  జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984లో ఆమె మరణించే వరకు భారత ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలందించారు. ఇందిరా గాంధీ తన పాలనలో ప్రధానమైన ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక అంశాలపై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1971లో పాకిస్తాన్​పై విజయం,  బంగ్లాదేశ్  ఏర్పాటులో కీలక పాత్రతో  ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతోపాటు భారత ప్రతిష్ఠను పెంచారు. గ్రీన్ రివల్యూషన్ (హరిత విప్లవం) దేశంలో ఆహార ఉత్పత్తులను పెంచడానికి దోహదపడింది. ఆమె ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం భారతదేశంలో ఆకలి సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. 20 పాయింట్స్​ కార్యక్రమం  నిరుద్యోగం, పేదరిక నిర్మూలన, విద్య,  ఆరోగ్య రంగాలలో సమగ్ర అభివృద్ధికి తోడ్పడింది. పేదలకు ప్రాధాన్యత కల్పించింది. ఇందిరా గాంధీ ‘భారతదేశపు ఉక్కు మహిళ’ గా ప్రపంచ దేశాల నాయకుల మన్ననలు పొందారు.  

–ఓపెన్​ పేజ్​ డెస్క్​