66,240 మంది ఉపాధి కూలీలకు రూ.39.74 కోట్లు రిలీజ్​

66,240 మంది ఉపాధి కూలీలకు  రూ.39.74 కోట్లు రిలీజ్​
  • లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు 
  • కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో స్కీమ్​
  • కోడ్​ ముగియగానే అన్ని జిల్లాలకూ ‘ఆత్మీయ భరోసా’

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఈ రెండు జిల్లాల్లోని 66,240 మంది ఉపాధి కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ చేసింది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైంది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్​గా ఎంపిక చేసి గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వస్తున్నారు. మొత్తం18,180 మందికి రూ.6 వేల చొప్పున జమ అయ్యాయి. 

ఈ క్రమంలో మండలి ఎన్నికల కోడ్​ అమల్లోకి రావడంతో ఇంది రమ్మ ఆత్మీయ భరోసా ఆగిపోయింది. అయితే, కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయా లని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆ రెండు జిల్లాల్లోని 66,240 మంది ఉపాధి కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ చేశారు. కాగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లు సర్కారు జమ చేసింది. మండలి ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారుల ఖాతాలోకి ఆత్మీయ భరోసా నిధులు చెల్లించనున్నది. డీబీటీ పద్ధతిలో నేరుగా ఉపాధి కూలీల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.