నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు: మంత్రి శ్రీధర్ బాబు

వరంగల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. ఏడాదిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే నాలుగేళ్ల ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామన్నారు. శనివారం (డిసెంబర్ 7) వరంగల్‎లో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా గొర్రెకుంటలో విప్ర బ్రహ్మణుల భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్ర బ్రాహ్మణ భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సమాజం మేలుకోరే వ్యక్తులు బ్రాహ్మణులని.. అలాంటి బ్రాహ్మణులు సమాజంలో గౌరవం కాపాడుకునే విధంగా ప్రవర్తించాలని సూచించారు.

పేద బ్రాహ్మణునులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారలోకి వచ్చిన ఏడాదిలోనే  రైతులకు 2లక్షల రుణమాఫీ చేశాం.. 200 యూనిట్లను విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని.. అలాగే  ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దని సూచించారు.