బేస్మెంట్​ పైసలు పడ్డయ్..​ ఇందిరమ్మ ఇండ్లకు బిల్లుల మంజూరు

బేస్మెంట్​ పైసలు పడ్డయ్..​ ఇందిరమ్మ ఇండ్లకు బిల్లుల మంజూరు
  • నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ
  • మలి విడత లబ్ధిదారుల ఎంపికకూ కసరత్తులు షురూ
  • జనగామ జిల్లాలో మొత్తం అప్లికేషన్లు 1,43,187​
  • నెరవేరుతున్న నిరుపేదల సొంతింటి కల

జనగామ, వెలుగు : తెలంగాణ సర్కారు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తుండడంతో పేదోడి సొంతింటి కల నెరవేరుతోంది.  ప్రజాపాలనలో భాగంగా జనగామ జిల్లాలో 1.43,187 మంది ఇండ్ల మంజూరు కోసం అప్లై చేసుకున్నారు. తొలి విడతలో ఎంపికైన బేస్మెంట్​ లెవల్​పనులు పూర్తి చేసిన లబ్ధిదారులకు తొలిదశ రూ.లక్ష నేరుగా వారి ఖాతాల్లో జమయ్యాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పనులు మొదలుపెట్టిన వారికి డబ్బుల జమ.. ​

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డబుల్​ బెడ్​రూం ఇండ్ల హామీ అమలు అటకెక్కింది. ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్​ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అర్హులైన వారికి ఇండ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. జనవరి 26న మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 

జనగామ జిల్లాలో మొదటి విడతలో 716 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో 354 మంది ఇండ్ల నిర్మాణాలకు పనులు మొదలు పెట్టారు. వీరిలో 97 మంది లబ్ధిదారులకు చెందిన నిర్మాణాలు బేస్మెంట్​ లెవల్​కు వచ్చాయి. బేస్మెంట్​ దశలో చెల్లించాల్సిన రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి.  

మిగిలిన గ్రామాల్లో కసరత్తులు..

తొలి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక ప్రక్రియ చేపట్టగా, ఇప్పుడు అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ నెల 22 నుంచి 30 వరకు పరిశీలన ప్రక్రియను పూర్తిచేసి వచ్చే నెల 2న గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించేలా ప్లాన్​ చేస్తున్నారు.

 వచ్చే నెల 5న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా ముందుకు సాగుతున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి దశలను అధికారులు ఫీల్డ్​ లెవల్​లో పరిశీలించి, అప్​లోడ్​ చేయనున్నారు.​ లబ్ధిదారులకు నాలుగు విడతల్లో డబ్బులను జమచేయనున్నారు. బేస్మెంట్ లెవల్​ లో రూ.లక్ష, పైకప్పు స్థాయి దాటిన తర్వాత రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.2 లక్షలు మొత్తం పనులు పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష, మొత్తంగా రూ.5 లక్షలు జమ చేయనున్నారు.  

- కల నెరవేరుతోంది..

సొంత ఇల్లు లేక గుడిసెలో ఉంటున్న మాకు సర్కారు ఇల్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ప్రజా పాలనలో అప్లికేషన్​ పెడితే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇళ్లు ఇచ్చిన్రు. బేస్మెంట్​ లెవల్​కు నిర్మాణం కాగానే రూ.లక్ష అకౌంట్ల జ-మ చేసిన్రు. - ముడావత్​ శిరీష, వాచ్చ తండా, తరిగొప్పుల మండలం

ఆనందంగా ఉంది..

ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసుకుంటే సర్కారు మంజూరు ఇచ్చింది. మా ఊర్లో మొదట నాకే ఇళ్లు ఇచ్చిండ్రు. బేస్మెంట్​ లెవల్​ రాగానే లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేసిన్రు. షాన సంతోషంగా ఉంది. ఇప్పుడు గోడల నిర్మాణం మొదలు పెడ్త. సర్కారు సహకారం మరువలేను. - మారోజు రేణుక, బొమ్మకూరు, నర్మెట మండలం

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 

సర్కారు ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నం. అర్హులందరికీ ఇండ్ల మంజూరు విడతల వారీగా ఉంటుంది. తొలి దశలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో బేస్మెంట్​ లెవల్​కు నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నవారి అకౌంట్లలో రూ.లక్ష జమయ్యాయి. వివిధ దశల్లో మొత్తం రూ.5 లక్షలు చెల్లించనున్నాం.- రిజ్వాన్​ బాషా షేక్​, కలెక్టర్​, జనగామ