- 10 లక్షల దరఖాస్తుల్లో 5 లక్షల మంది వివరాల సేకరణ
- బల్దియా కమిషనర్ ను ఆరా తీసిన మంత్రి పొంగులేటి
- సిబ్బంది లేక ఆలస్యం అయ్యిందన్న కమిషనర్
- స్పీడప్ చేయాలన్న ఇన్చార్జి మంత్రి పొన్నం
- సొంత జాగా ఉన్న వారిని గుర్తిస్తున్న సిబ్బంది
హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో బల్దియా వెనకబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా సర్వే పూర్తి కాగా, గ్రేటర్ లో మాత్రం 50 శాతం మాత్రమే కంప్లీట్ అయ్యింది. దీంతో బల్దియా తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బల్దియా కమిషనర్‌ను ఆరా తీసినట్టు తెలిసింది.
నాలుగు రోజుల కింద హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా సర్వే ఆలస్యంపై ఫైర్ అయినట్టు తెలిసింది. దీంతో సర్వేయర్లను పెంచామని, సర్వే స్పీడప్ చేస్తామని మంత్రికి కమిషనర్ వివరణ ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 10,70,659 అప్లికేషన్లు రాగా 5,01,363 దరఖాస్తుల సర్వే మాత్రమే పూర్తి చేశారు.
ఇతర జిల్లాల్లో వందశాతం పూర్తయినా గ్రేటర్ లో ఆలస్యానికి బల్దియా అధికారులు, సిబ్బంది రెండు కారణాలు చెప్తున్నారు. దరఖాస్తుదారులు ఉండకపోవడం ఒక కారణమైతే, సిబ్బంది కొరత ప్రధాన కారణమని అంటున్నారు. 10 రోజుల క్రితం వరకు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు మాత్రమే సర్వేలో పాల్గొనగా, తర్వాత అర్బన్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ విభాగానికి సంబంధించి కమ్యూనిటీ ఆర్గనైజర్లకు బాధ్యతలు అప్పగించారు. వీరందరికి ప్రత్యేకంగా లాగిన్లు ఇచ్చి సర్వే స్పీడప్ చేశారు.
ఇండ్లు ఖాళీ చేసి పోవడంతో సమస్య
రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల దరఖాస్తులు రాగా, గ్రేటర్ లోనే 10 లక్షలు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో లబ్ధిదారులను గుర్తించడం బల్దియా సిబ్బందికి సవాల్ గా మారింది. నగరంలో అద్దె ఇండ్లలో ఉండే వారి సంఖ్య ఎక్కువ. వీరిలో అప్లై చేసుకున్న చాలామంది సర్వేకు వెళ్లినప్పుడు ఇచ్చిన అడ్రస్‌లో ఉండడం లేదని తెలుస్తోంది. చాలాచోట్ల ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఓనర్లు చెప్తున్నారు. ఆ ఇండ్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అద్దెకు ఉంటున్నారు.
వారు తాము ఇంతకముందు వేరే ప్రాంతంలో దరఖాస్తు చేసుకున్నామని, తమ వివరాలు ఇక్కడ నమోదు చేసుకోవాలని కోరుతున్నారు. సర్వేయర్లకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న వారి డిటెయిల్స్ ఎంటర్ చేసే వీలు లేకుండా పోయింది. వార్డు వారీగా కాకుండా గ్రేటర్ లో ఎక్కడ దరఖాస్తు చేసినా వారి వివరాలను సర్వేయర్లు ఎంట్రీ చేసేలా ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు.
సొంత జాగ ఉన్న వారి గుర్తింపు
గ్రేటర్ లో 24 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గానికి 3500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే, మొదటి విడతలో సొంత జాగా ఉన్న 84 వేల మందిని సెలెక్ట్ చేసి ఇండ్లు కట్టించి ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సర్వే చేస్తున్న సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు వెళ్తున్నారు.
దరఖాస్తుదారుడు ఇచ్చిన అడ్రస్‌లో ఉంటే ఫొటో తీసుకుని, స్థలం రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ తో పాటు యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 55 శాతం సర్వే పూర్తికాగా, ఇండ్లు లేకుండా సొంత స్థలాలున్న 9913 మంది వివరాలు సేకరించారు. జాగా లేని వారి వివరాలు కూడా యాప్ లో ఎంటర్చేస్తున్నారు. వీరికి రెడీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చే ఛాన్స్ ఉంది.