- యాదాద్రిలో 93.1 శాతం పూర్తి
- చివరి స్థానంలో అసిఫాబాద్
యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాదాద్రి జిల్లాలో స్పీడ్‌గా సాగుతోంది. సర్వే ఆరంభంలో కాస్తా ఇబ్బందులు ఎదురైనా.. చివరకు ఊపందుకున్నది. ప్రభుత్వం విధించిన డిసెంబర్31 గడువు నాటికి 93.1 శాతం సర్వే పూర్తి చేసి యాదాద్రి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. సొంతిండ్లు లేని వారికి ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ స్కీం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపింది. అయితే ప్రజాపాలన అప్లికేషన్లలో ఇందిరమ్మ ఇండ్ల కోసం యాదాద్రి జిల్లాలో 2,01,977 కుటుంబాలు అప్లయ్చేసుకున్నాయి.
ఇబ్బందులు కలిగినా..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే జరుగుతోంది. సర్వే ప్రారంభంలో కొంత ఇబ్బంది కలిగినా తర్వాత ఊపందుకుంది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం ఈ సర్వేలో పాల్గొనడానికి సొంతూళ్లకు వచ్చారు. ఖాళీ స్థలం ఉన్నా స్థానికంగా ఉండకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. అప్లయ్ చేసుకున్న తర్వాత చనిపోయిన కుటుంబ యజమాని విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు సాగుతుండడంతో ఇండ్ల వద్ద సర్వే సిబ్బంది వెళ్లే సమయానికి ఇంటి యజమాని అందుబాటులోకి రాలేదు. ఇంటి యజమాని ఫొటో తప్పనిసరిగా సేకరించాల్సి రావడంతో ఒకటికి రెండు, మూడు సార్లు సర్వే సిబ్బంది ఇండ్లకు వెళ్లాల్సి వచ్చింది.
93. 1 శాతం పూర్తి..
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను డిసెంబర్ 31 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశాలకు అనుగుణంగా సర్వే స్పీడ్‌గా నిర్వహించారు. ఇండ్ల కోసం 2,01,977 కుటుంబాలు అప్లయ్ చేసుకోగా, వారిలో మంగళవారం నాటికి 1,84,388 (93.1 శాతం) ఇండ్లలో సర్వే చేశారు. మోత్కూరు, పోచంపల్లి, బొమ్మలరామారాం, యాదగిరిగుట్ట తదితర మండలాల్లో 96 శాతానికి పైగా సర్వే పూర్తి చేశారు. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ సభలు నిర్వహించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
స్టేట్‌లో యాదాద్రి ఫస్ట్..
ఇండ్ల సర్వేలో స్టేట్‌లోనే యాదాద్రి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రాజన్న సిరిసిల్ల, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 67 శాతం సర్వే జరగడంతో చివరి స్థానంలో నిలిచింది. జీహెచ్ఎంసీలో కేవలం 15 శాతంలోపే సర్వే జరిగింది. ఓవరాల్‌గా స్టేట్లెవల్లో70 శాతానికి పైగా సర్వే జరిగింది.
సర్వే చివరి దశకు చేరింది
ఇందిరమ్మ ఇండ్ల సర్వే చివరి దశకు చేరింది. ఇండ్ల కోసం అప్లయ్ చేసుకున్న వారందరినీ సర్వేలో పాల్గొనే విధంగా చేశాం. స్టాఫ్ ఇండ్లకు వెళ్లిన సమయంలో ఇంటి యజమాని లేకపోవడం వంటి కారణాలతో కొంత ఇబ్బంది కలిగినా లక్ష్యానికి అనుగుణంగా సర్వే చేయగలిగాం.
- వీరారెడ్డి, అడిషనల్ కలెక్టర్, యాదాద్రి