అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు: ఎమ్మెల్యే వివేక్

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు: ఎమ్మెల్యే వివేక్

మంచిర్యాల: కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పండిన దొడ్డు బియ్యాన్ని మహారాష్ట్రలో బ్లాక్‎లో అమ్ముకునే వారని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ మాత్రం.. పేద ప్రజలు కూడా సన్న బియ్యం అన్నం తినాలని రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. మంగళవారం (ఏప్రిల్ 15) చెన్నూర్ మండలంలోని సోమనపల్లె గ్రామంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వివేక్ పాదయాత్ర చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. సోమనపల్లిలో మీ సమస్యలు వినడానికి వచ్చానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను మొదటిసారి సోమన పల్లె గ్రామంలోనే మీటింగ్ పెట్టానని.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మిమ్మల్ని ఎప్పటికీ మరవలేనని అన్నారు. 

సోమనపల్లెకి 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు వేయించామని, 40 లక్షల రూపాయల నిధులతో ఊర్లో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. 3 కోట్ల రూపాయలతో దుబ్బపలె బ్రిడ్జి టెండర్ అయిందని తెలిపారు. రూ.200 కోట్లతో  సోమనపల్లెలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. చెన్నూర్‎లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే.. పొక్కూరులో 288 మందికి మోడల్ విలేజ్‎లో భాగంగ ఇల్లు వచ్చిందని తెలిపారు. 

మహిళలందరికీ కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్సు సదుపాయం కల్పించిందని.. ఇందుకోసం రూ.5600 కోట్ల ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామన్నారు. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డు ఇస్తామని పేర్కొన్నారు. అధికారులనే మీ దగ్గరకు పంపి అర్హులైన అందరికీ పథకాలు వచ్చేలా చూస్తామన్నారు.