వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్లో

వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్లో
  • వనపర్తి జిల్లాలో 1,200 ఇండ్ల మంజూరు
  • కొనసాగుతున్న మార్క్​ అవుట్ లు 

వనపర్తి, వెలుగు: ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి మంజూరు పత్రాలు అందజేసి ఇల్లు నిర్మించుకోవాలని సూచించినా, లబ్ధిదారులు ఆలస్యం చేస్తున్నారు. దీంతో వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్లోగా ముందుకెళ్తోంది. ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు మండల కేంద్రంలో నమూనా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నారు. జిల్లాలోని 15 మండలాలు ఉండగా, 9 మండలాల్లో నమూనా ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఆరు మండలాల్లో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించలేదు. జిల్లా యంత్రాంగం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్పీడప్​ చేయడంపై దృష్టి సారించింది.

274 ఇండ్లకే మార్క్​అవుట్..

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 1,200 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 274 ఇండ్లకు మార్క్​అవుట్​ ఇచ్చారు. ఇంకా మార్క్​ అవుట్​ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇండ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నా.. ఇల్లు నిర్మించుకోడానికి వారు ముందుకు రావడం లేదు. ఈ నెల 15 నాటికే మార్క్​అవుట్​ ప్రక్రియ పూర్తి చేసి పునాది వేసుకుంటే, మొదటి విడత కింద ఒక్కో ఇంటికి రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమ​అవుతాయని హౌసింగ్​ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా మార్క్​ అవుట్  ప్రక్రియ పూర్తి కాలేదు. 

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇలా..

జిల్లాలోని 15 మండలాల్లో ఒక్క రేవల్లి మండలంలోని తల్పనూరులో 37 ఇండ్లకు మార్క్​ అవుట్​ ఇవ్వగా, చిన్నంబావిలో ఇంకా ప్రారంభం కాలేదు. ఖిల్లాగణపురం, అమరచింత, శ్రీరంగాపురం మండలాల్లో ఎంపికైన గ్రామాల్లో పది లోపే మార్క్​ అవుట్​లు జరగడం గమనార్హం. వనపర్తి మండలం అప్పాయిపల్లిలో 14, గోపాల్​పేట మండలం చెన్నూరులో 15, పాన్​గల్​ మండలం మాధవరావుపల్లిలో 21, ఏదుట్ల మండలం చిక్కేపల్లిలో 29, రేవల్లి మండలం తల్పనూరులో 37, పెద్దమందడి మండలం మంగంపల్లిలో 13, ఖిల్లాగణపురం మండలం సల్కెలాపూరులో 5, కొత్తకోట మండలం రామంతపూరులో 11, మదనాపురం మండలం దంతనూరులో 10, ఆత్మకూరు మండలం దేవర్లపల్లిలో 17, అమరచింత మండలం చింతారెడ్డిపల్లిలో 5, వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లిలో 11, పెబ్బేరు మండలం ఈర్లదిన్నెలో 22, శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లిలో 8 ఇండ్లకు మార్క్​ అవుట్​లు ఇచ్చారు. 

మార్క్​ అవుట్​లు కొనసాగుతున్నాయి..

జిల్లాలో ఇప్పటి వరకు 300 ఇండ్లకు మార్క్​ అవుట్​లు ఇచ్చాం. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే ఇండ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులకు అవగాహన కల్పించాం. వారు ఇండ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. 

విఠోబా, డీఈ హౌసింగ్, వనపర్తి