స్లోగా ఇందిరమ్మ ఇండ్ల పనులు

స్లోగా ఇందిరమ్మ ఇండ్ల పనులు
  • ఇప్పటివరకు 7 వేల ఇండ్ల పనులే మొదలు
  • లబ్ధిదారులు వ్యవసాయ పనుల్లో బిజీ
  • ‌‌ఇల్లు సాంక్షన్ అయిన 45 రోజుల్లో వర్క్ ప్రారంభించాలని రూల్
  • ‌‌వచ్చే నెలలో స్పీడప్ అయ్యే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్లోగా జరుగుతుంది. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చినా బేస్ మెంట్  పనులు ఇంకా ప్రారంభించలేదు. ఈ ఏడాది జనవరి 26న రాష్ర్టవ్యాప్తంగా సుమారు 71, 200  ఇండ్లు సాంక్షన్  చేసి గ్రామసభల్లో లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల మంజూరు పత్రాన్ని అందజేశారు. అయితే మంజూరు పత్రం తీసుకున్న 45 రోజుల్లోగా ఇంటి నిర్మాణం స్టార్ట్  చేయాల్సి ఉంటుందని స్కీమ్  గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. 

ఈ గడువు సోమవారంతో ముగియగా ఇప్పటి వరకు రాష్ర్టవ్యాప్తంగా ఏడు ఇండ్ల పనులు మాత్రమే స్టార్ట్  అయినట్లు హౌసింగ్  కార్పొరేషన్  అధికారులు చెబుతున్నారు. సొంత జాగాను క్లీన్  చేయడం, పునాదులు తీయడం, బేస్ మెంట్  కట్టడం వంటి పనులు నిదానంగా సాగుతున్నాయి. సొంత జాగాలో ఉన్న గుడిసె లేదా రేకుల ఇళ్లను కూల్చటం,  ప్లేస్ ను చదును చేయడంతో పాటు మరోవైపు వ్యవసాయ పనులు కూడా ఉండడంతో పనులు లేట్  అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో పనులు వేగం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్లు పనులు స్టార్ట్  చేసేలా వర్క్ ఇన్ స్పెక్టర్లు, ఎంపీడీవోలు, ఏఈఈలు, పంచాయతీ కార్యదర్శులతో అవగాహన కల్పించాలని హౌసింగ్  ఉన్నతాధికారులు కోరుతున్నారు. 

6 వేల అనర్హుల గుర్తింపు

రాష్ర్టంలో జనవరి 26న లబ్ధిదారులకు ఇచ్చిన అప్లికేషన్లను అధికారులు గ్రామాల్లోకి మళ్లీ వెరిఫికేషన్  చేశారు. ఇందులో సుమారు 6 వేల మందిని అనర్హులుగా గుర్తించి, వారికి ఇండ్లు రిజెక్ట్  చేశామని హౌసింగ్  కార్పొరేషన్  అధికారులు తెలిపారు. అనర్హులుగా తేలితే ఇళ్ల నిర్మాణం స్టార్ట్  అయిన తరువాత కూడా రద్దు చేస్తామని పేర్కొన్నారు. 

రెండో విడత సర్వే

తొలి విడతలో ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులు ఈనెలాఖరులోగా ఇంటి పని స్టార్ట్  చేసేలా ప్రాజెక్టు డైరెక్టర్లు, ఎంపీడీవో, పంచాయతీ  కార్యదర్శులు అవగాహన కల్పించాలని ఇటీవల హౌసింగ్  కార్పొరేషన్  ఎండీ వీపీ గౌతమ్  ఆదేశించారు. బేస్ మెంట్  నిర్మాణం ప్రారంభిస్తే  తొలిదశ ఇంటి నిర్మాణానికి రూ.1 లక్ష ఫండ్  రిలీజ్  చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఈనెలతో ఫైనాన్సియల్  ఇయర్  ముగుస్తున్నందున ఫండ్స్  రిలీజ్  చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఈనెలలో తొలిదశ కింద సుమారు రూ.2 వేల కోట్లు రిలీజ్  చేయనున్నారు. కాగా.. రెండో దశ లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను హౌసింగ్  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆదేశించారు. తొలి దశలో రూరల్ లో మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా రెండో విడతలో అర్బన్ ఏరియాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పీఎం ఆవాస్  స్కీమ్  కింద అర్బన్  ఏరియాల్లో లక్ష ఇళ్లు సాంక్షన్  చేసేందుకు కేంద్ర ప్రభుత్వం  అంగీకరించింది.