అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

  •  నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   

హుజూర్‌‌‌‌నగర్, వెలుగు : తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని నీటి పారుదల, పౌరసరఫరాలశాఖల  మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌‌‌‌నగర్ లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రామస్వామిగుట్ట వద్ద మోడల్ కాలనీలో ఇండ్లు నిర్మించే స్థలాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

 తను గతంలో హౌసింగ్ మంత్రిగా పనిచేసినప్పుడు  పట్టణంలోని రామస్వామిగుట్ట వద్ద 112 ఎకరాల్లో 2,160  ఇండ్లు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వం మారగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆ ఇండ్లు అందకుండా పడావు పెట్టిందని మండిపడ్డారు. అనంతరం ఐటీఐ కళాశాల, ఏటీసీ సెంటర్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. క్రిస్టియన్ శ్మశాన వాటికను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. 

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం..

హుజూర్ నగర్ లోని ఏరియా హాస్పిటల్ కు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి డాక్టర్లకు సూచించారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలని వైద్యులకు చెప్పారు. పట్టణంలోని100 పడకల ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.

 పేషెంట్లకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, స్టాప్ నర్సులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పురస్కరించుకుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.