అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

 అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు :  మంత్రి పొంగులేటి

పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ పథకాని భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రారంభించామని చెప్పారు.    ఈ ఏడాది పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని ఇందుకు అనుగుణంగా  వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపులు కూడా జరుపుతున్నామని వెల్లడించారు. సచివాలయంలో హౌసింగ్ పై ఆయనసమీక్ష నిర్వహించారు. 

 వచ్చే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ  ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి,  మొదటి దశలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3 వేల500 ఇండ్ల  చొప్పున 4 లక్షల16 వేల 500 ఇండ్లు,  రిజర్వ్ కోట కింద  33 వేల 500 ఇండ్లు నిర్మించాలని నిర్ణయించామన్నారు.   ఇందుకు అవసరమైన 22 వేల 500  కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రికి వెల్లడించామన్నారు. 

 గడచిన పది సంవత్సరాలలో సొంత ఇంటి సాకారం అనేది పేదవారికి అందని ద్రాక్షలా మారిందని మంత్రి పొంగులేటి ఆవేదం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి కనిపిస్తున్నాయని అన్నారు.  పేదలు ఆత్మగౌరంతో బతకాలన్న ఆలోచనతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామని,  రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.