
- పైలట్ గ్రామాల్లో బేస్మెంట్ కంప్లీట్ అయిన వాటికి బిల్లుల చెల్లింపు
- మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ రెడీ చేసేందుకు సర్వే
- జిల్లాలో 61 మంది అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన
కామారెడ్డి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పైలట్ గ్రామాల్లో నిర్మాణాలు షురూ చేయగా, బేస్మెంట్పూర్తైనవాటికి బిల్లులు చెల్లించింది. మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల తుది జాబితాపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కామారెడ్డి జిల్లాలో 61 మంది అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరు వరకల్లా పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో 1,03,342 అప్లీకేషన్లు రాగా, పైలట్ ప్రాజెక్టుగా 22 గ్రామాలను ఎంపిక చేసి జనవరిలో పనులు ప్రారంభించారు. పైలట్ గ్రామాల్లో 1,719 ఇండ్లు మంజూరు కాగా, 374 ఇండ్లకు అధికారులు మార్కవుట్ ఇచ్చారు. ఇందులో 62 ఇండ్లు బేస్మెంట్ లెవల్ కంప్లీట్ అయ్యాయి. జియో ట్యాంగింగ్తో ఆన్లైన్ చేయగా సైజులు హెచ్చు తగ్గులు వచ్చి 10 ఇండ్లు రిజెక్టు అయ్యాయి. ఆన్లైన్లో 52 ఇండ్లు ఎంట్రీ కాగా, బేస్మెంట్ పూర్తయిన 40 మంది లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున పేమెంట్ చేశారు.
మిగతా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టేలా ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. హౌజింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో రివ్యూలు నిర్వహించి నిర్మాణాలు స్పీడప్ చేయాలని తెలిపారు.
సర్వే స్పీడప్..
పైలట్ గ్రామాల్లోనే కాకుండా మిగతా గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టు ఫైనల్ చేయడానికి సర్వే స్పీడప్ చేశారు. స్థలం ఉందా.. లేదా, ప్రస్తుతం వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు.. అన్న వివరాలను సేకరించి వారి అప్లికేషన్లను పంచాయతీ సెక్రటరీలు ఆన్లైన్లో పొందుపర్చారు. 61 మంది అధికారులు గ్రామాల వారీగా వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల తుది జాబితాను నిర్ణయించనున్నారు. నియోజకవర్గాలకు కేటాయించాల్సిన ఇండ్ల సంఖ్య కంటే 20 శాతం ఎక్కువ అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 3,574, ఎల్లారెడ్డిలో 3,447, జుక్కల్‌లో 3,400, బాన్సువాడలో 1,989 అప్లికేషన్లను అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. మే 2 వరకల్లా మండలాల వారీగా లబ్ధిదారుల లిస్టు ఫైనల్ చేసి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదానికి పంపనున్నారు.
నిర్మాణ సైజ్‌లో తేడా వస్తే..
ఇందిరమ్మ ఇంటిని 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలోనే నిర్మించాలి. ఏ మాత్రం తేడా ఉన్నా ఆన్లైన్ తీసుకోదు. భూమి లెవల్ నుంచి ఆయా దశల్లో ఇంటి నిర్మాణ పనులను జియో ట్యాగింగ్ చేస్తారు. ట్యాగింగ్ అయి ఆన్లైన్లో ఎంట్రీ అయితేనే బిల్లు వస్తుంది. ప్రభుత్వం నిర్ధేశించిన రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పాత ఇండ్లు, జియో ట్యాగింగ్ లేకుండా నిర్మించే ఇండ్లకు బిల్లుల చెల్లింపు ఆగిపోయే అవకాశం ఉంది. జిల్లాలో విస్తీర్ణం సైజుల్లో తేడా వచ్చిన 10 ఇండ్ల బేస్మెంట్ లెవల్ పేమెంట్ ఆగిపోయింది.
ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టేలా చర్యలు..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బేస్మెంట్ లేవల్ కంప్లీట్ అయి ఆన్లైన్లో ఎంట్రీ అయిన లబ్ధిదారులకు రూ . లక్ష చొప్పున బిల్లు పేమేంట్ చేశాం. మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చూస్తున్నాం. మిగతా గ్రామాల్లో కూడా సర్వే చేస్తున్నాం. - విజయ్‌పాల్‌రెడ్డి. హౌజింగ్ పీడీ